కొత్త జెర్సీలో టీమిండియా ప్లేయర్లు.. లుక్ అదిరిపోయింది
రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా ఈనెల 7 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో తలపడనుంది. లండన్ లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నుంచి టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. భారత జాతీయ జట్టుకి కిట్ స్పాన్సర్ గా ఎంపికైన అడిడాస్ ఈ కొత్త జెర్సీని రూపొందించింది. మూడు ఫార్మాట్లకు ప్రత్యేక జెర్సీలను విడుదల చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ముందు టెస్టు జెర్సీతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా జట్టు ఆటగాళ్లంతా ఫోటోలకు ఫోజులిచ్చారు. వీటిని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
అడిడాస్ తో ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ
కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ లో టీ20 జెర్సీ ఉండగా.. వన్డేలకు లైట్ బ్లూ కాలర్ తో ఉన్న జెర్సీని ఎంపిక చేశారు. టెస్టు లకు పూర్తిగా వైట్ కాకుండా కాస్త బ్లూ కలర్ ను యాడ్ చేసి అకర్షణీయంగా జెర్సీని రూపొందించారు. వీటిని చూసిన అభిమానులు కొత్త జెర్సీల లుక్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. కొంతకాలంగా కిల్లర్ జీన్స్ టీమిండియా కిట్ స్పాన్సర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే కిల్లర్ జీన్స్ తో బీసీసీఐ ఒప్పందం ముగియడంతో తాజాగా అడిడాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అడిడాస్ ఇప్పటికే ఫుట్ బాల్ లీగ్స్ లో పలు జట్లకు కిట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది.