Loading...
IND Vs SL: పేసర్లు విఫలం.. లంక ఎలెవన్‌ భారీ స్కోర్
పేసర్లు విఫలం.. లంక ఎలెవన్‌కు భారీ స్కోర్

IND Vs SL: పేసర్లు విఫలం.. లంక ఎలెవన్‌ భారీ స్కోర్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 08, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత బౌలర్ల ప్రదర్శన నిరాశపరిచింది. శ్రీలంక క్రికెట్‌ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తొలి రోజే టీమిండియా ప్రధాన బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక క్రికెట్‌ ఎలెవన్‌.. ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. పూర్తి స్థాయి జట్టుతో భారత్‌ బరిలోకి దిగినా.. దేశవాళీ ఆటగాళ్లతో కూడిన శ్రీలంక ఎలెవన్‌ను కట్టడి చేయలేకపోయింది. స్పిన్నర్లు మానవ్‌ సుతార్‌ (2/33), రవీంద్ర జడేజా (2/64), కుల్దీప్‌ (2/76) ఫర్వాలేదనిపించారు. అయితే పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌ (0/44), ప్రసిద్ధ్‌ కృష్ణ (0/32) వికెట్లు తీయలేకపోయారు. బ్రార్‌ 1/49తో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

వివరాలు

ఓపెనర్‌ నిషాన్‌ ఫెర్నాండో 66 పరుగులు..

శ్రీలంక ఎలెవన్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ నిషాన్‌ ఫెర్నాండో 66 పరుగులు చేశాడు.

65 బంతులు ఎదుర్కొన్న అతడు 11 ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. మరో ఓపెనర్‌ రవిందు రసంత 143 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 71 పరుగులు చేశాడు.

కెప్టెన్‌ సోనాల్‌ దినుష 72 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు సాధించాడు.

వీరితో పాటు పవన్‌ రత్ననాయకే (39), పసిందు సూర్యబండార (35), రమేశ్‌ మెండిస్‌ (32), అహాన్‌ విక్రమసింఘే (31) కూడా రాణించారు.

శ్రీలంక ఎలెవన్‌ టాప్‌-6 బ్యాటర్లలో ప్రతి ఒక్కరూ 30కిపైగా పరుగులు చేయడం విశేషం.

ఓపెనర్లు దూకుడుగా ఆడటంతో తొలి 20 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా 100కుపైగా పరుగులు చేసింది.

వివరాలు

భారత స్పిన్నర్లు ప్రభావం..

అయితే మధ్యాహ్నం తర్వాత భారత స్పిన్నర్లు ప్రభావం చూపడంతో వరుసగా వికెట్లు పడ్డాయి.

ఆట చివరి దశలో శ్రీలంక ఎలెవన్‌ వికెట్ల పతనం కాస్త వేగంగా సాగింది.

పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోవడం నిరాశ కలిగించే అంశమే.

భారత స్పిన్నర్లలో మానవ్‌ సుతార్‌ మాత్రమే లంక బ్యాటర్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టాడు.

జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ ఓ మోస్తరు ప్రదర్శనతో సరిపెట్టుకున్నారు. కొత్త స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌ 11 ఓవర్లు బౌలింగ్‌ చేసి వికెట్‌ తీయకుండానే 54 పరుగులు సమర్పించుకున్నాడు.

ADVERTISEMENT