LOADING...
IPL 2026 - Playoffs: ప్లేఆఫ్స్ ఫైట్ షురూ.. నాలుగు జట్లలో అసలైన ఫేవరెట్ టీమ్ ఇదే?
ప్లేఆఫ్స్ ఫైట్ షురూ.. నాలుగు జట్లలో అసలైన ఫేవరెట్ టీమ్ ఇదే?

IPL 2026 - Playoffs: ప్లేఆఫ్స్ ఫైట్ షురూ.. నాలుగు జట్లలో అసలైన ఫేవరెట్ టీమ్ ఇదే?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కూడా తన దూకుడు కొనసాగిస్తూ నాకౌట్ దశకు అగ్రస్థానంలో చేరుకుంది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించిన ఆర్సీబీ (+0.783) మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచి తొలి క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తూ ముందుకు సాగిన ఈ జట్టు వ్యూహాత్మక ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు పొందింది. సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేయకుండా, అవసరమైన నెట్‌రన్‌రేట్‌పై దృష్టి పెట్టడం ఆ జట్టు వ్యూహానికి నిదర్శనం.

వివరాలు

బ్యాటింగ్ లో విరాట్, పడిక్కల్, టిమ్ డేవిడ్ కీలక పాత్ర

బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్, వెంకటేశ్ అయ్యర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్‌లో స్వింగ్‌, లైన్ అండ్ లెంగ్త్‌తో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ ప్రత్యర్థులకు కష్టాలు తెస్తున్నారు. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య అవసరమైన సమయంలో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో ముందుండగా, విరాట్ కోహ్లీ 563 పరుగులతో ఆరెంజ్ క్యాప్ పోటీలో కొనసాగుతున్నాడు.

వివరాలు

సైలెంట్ కిల్లర్‌గా గుజరాత్ టైటాన్స్

సీజన్ ప్రారంభంలో నాకౌట్ అవకాశాల జాబితాలో పెద్దగా వినిపించని గుజరాత్ టైటాన్స్ అనూహ్య ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ మాదిరిగానే 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించింది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలకే పరిమితమైన జట్టు, తర్వాతి ఏడింట్లో ఆరు గెలిచి ప్లే ఆఫ్స్ చేరుకుంది. ఎలాంటి హడావుడి లేకుండా సమష్టి ప్రదర్శనతో ముందుకు వచ్చిన ఈ జట్టుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రధాన బలం. గిల్‌తో పాటు సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉండటం గుజరాత్ బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది.

Advertisement

వివరాలు

స్టార్ ఆల్‌రౌండర్లగా జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్

జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ కూడా అవసరమైనప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణల పేస్ త్రయం ప్రత్యర్థులను కుదేలు చేస్తోంది. స్టార్ ఆల్‌రౌండర్లు జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్ జట్టుకు అదనపు బలంగా నిలిచారు. ప్రస్తుతం రబాడ 24 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉండగా, రషీద్ ఖాన్ 19 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు.

Advertisement

వివరాలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ - 'రైజింగ్' ఫోర్స్

అగ్రస్థానాన్ని కాస్త తేడాతో కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది. ఇషాన్ కిషన్‌, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో జట్టు అద్భుత విజయాలు నమోదు చేసింది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించినప్పటికీ నెట్‌రన్‌రేట్ కారణంగా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. డేంజరస్ బ్యాటింగ్ లైనప్‌తో పాటు యువ బౌలింగ్ దళం ఈసారి హైదరాబాద్ ప్రత్యేకతగా నిలిచింది. అభిషేక్ శర్మ - ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీ ప్రత్యర్థులకు భారీ ముప్పుగా మారింది.

వివరాలు

ఫామ్ లోకి వచ్చిన ట్రావిస్ హెడ్

ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డ హెడ్ ఇప్పుడు ఫామ్‌లోకి రావడం జట్టుకు ఊరటనిచ్చింది. గత రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఇషాన్ కిషన్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి, స్మరణ్, సలీల్, అనికేత్ అందరూ హిట్టర్లుగా రాణిస్తున్నారు. ప్రతి మ్యాచ్‌లో రెండంకెల స్కోరు చేస్తున్న క్లాసెన్ పరిస్థితులకు తగ్గట్టు ఆడటం విశేషం. బౌలింగ్‌లో ప్రఫుల్ హింగే, సకిబ్, శివాంగ్, ఇషాన్ మలింగ వంటి యువ బౌలర్లను కెప్టెన్ కమిన్స్ సమర్థంగా నడిపిస్తున్నాడు. ఇషాన్ మలింగ కూడా పర్పుల్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు.

వివరాలు

మధ్యలో తడబడ్డా.. మళ్లీ గాడిలో పడిన రాజస్థాన్

చివరి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకున్న రాజస్థాన్ ప్రయాణం ఈ సీజన్‌లో ఆసక్తికరంగా సాగింది. తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో దూసుకెళ్లిన ఈ జట్టు ఆ తర్వాత ఒక్కసారిగా గాడి తప్పింది. తరువాతి మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలకే పరిమితమై ప్లే ఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లో లఖ్‌నవూ, ముంబయిపై విజయాలతో నాలుగో స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్‌కు కీలక ఆటగాడిగా నిలిచాడు. పలు మ్యాచ్‌ల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ యువ ఆటగాడు 583 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ వెన్నెముకలా మారాడు.

వివరాలు

పర్పుల్ క్యాప్ రేసులో ఆర్చర్

ముఖ్యంగా ముంబయితో జరిగిన చివరి మ్యాచ్‌లో అతని ప్రదర్శనే విజయానికి కీలకం అయింది. ఆర్చర్ ప్రస్తుతం 21 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. ఇక ధ్రువ్ జురెల్ నిలకడైన ప్రదర్శన రాజస్థాన్‌కు పెద్ద ప్లస్ కాగా, కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా కీలక సమయాల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు తోడ్పడుతున్నాడు.

Advertisement