LOADING...
T20 World Cup: ఆరునూరైనా సరే.. టీ20 వరల్డ్‌కప్‌లో 300 కొట్టే సత్తా ఉన్న జట్లు ఇవే!
ఆరునూరైనా సరే.. టీ20 వరల్డ్‌కప్‌లో 300 కొట్టే సత్తా ఉన్న జట్లు ఇవే!

T20 World Cup: ఆరునూరైనా సరే.. టీ20 వరల్డ్‌కప్‌లో 300 కొట్టే సత్తా ఉన్న జట్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌-2026కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ వంటి శక్తివంతమైన జట్లపై కూడా పెద్ద అంచనాలే ఉన్నాయి. అయితే టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టునైనా తక్కువగా అంచనా వేయడం ప్రమాదకరమని మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌కు దూరంగా, స్పష్టమైన వ్యూహంతో ఆడితేనే విజయం సాధ్యమని సూచిస్తున్నారు.

Details

భారత్, ఆస్ట్రేలియా సాధించే అవకాశం

ఈసారి భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ టోర్నీలో 300 పరుగులకుపైగా స్కోర్లు కూడా నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. ఈ అంశంపై టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు 300 పరుగుల మార్కును అందుకునే సత్తా కలిగి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రెండు జట్లలోనూ విధ్వంసకర బ్యాటర్లు ఉండటం, టాప్‌ ఆర్డర్‌లో శతకాలు నమోదైతే భారీ స్కోరు సాధించడం కష్టమేమీ కాదని తెలిపారు.

Details

బలమైన జట్లుగా ఆస్ట్రేలియా, టీమిండియా

టీమిండియా, ఆస్ట్రేలియా రెండూ సమతుల్యమైన జట్లుగానే కనిపిస్తున్నాయి. అయితే, స్వదేశంలో ఆడటం భారత జట్టుకు అదనపు ప్రయోజనంగా మారనుంది. బ్యాటింగ్‌లో లోతు, బౌలింగ్‌లో వైవిధ్యం ఉండటంతో పాటు, ప్రపంచకప్‌కు ముందు తగినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కూడా భారత్‌కు లభించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కారణంగా ఒత్తిడి తప్పనిసరిగా ఉన్నప్పటికీ, దాన్ని సమర్థంగా ఎదుర్కోగలిగితే టీమిండియాను ఆపడం కష్టమే. ఫీల్డింగ్‌లో పొరపాట్లు తగ్గించి, పక్కా ప్రణాళికతో ఆడితే భారత్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ టీ20 ప్రపంచకప్‌లు గెలిచే జట్టుగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Details

నూతన రికార్డులు సృష్టించే అవకాశం

మరోవైపు, ఆస్ట్రేలియా జట్టు కూడా బలమైన లైనప్‌తో టోర్నీలోకి అడుగుపెడుతోంది. ట్రావిస్‌ హెడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌, కామెరూన్‌ గ్రీన్‌, జోష్‌ ఇంగ్లిస్‌, టిమ్‌ డేవిడ్‌ వంటి పవర్‌ హిటర్లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ విభాగం అత్యంత ప్రమాదకరంగా మారింది. అందుకే భారత్‌, ఆస్ట్రేలియా జట్లు రెండూ 300 పరుగులు సాధించే సామర్థ్యం కలవని రవిశాస్త్రి మరోసారి నొక్కిచెప్పారు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఏ జట్టు కొత్త రికార్డులు సృష్టిస్తుందన్నదానిపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

Advertisement