Loading...
T20 World Cup 2026: టీ20ప్రపంచకప్'లో ఆస్ట్రేలియా పతనానికి కారణాలు ఇవే..
టీ20ప్రపంచకప్'లో ఆస్ట్రేలియా పతనానికి కారణాలు ఇవే..

T20 World Cup 2026: టీ20ప్రపంచకప్'లో ఆస్ట్రేలియా పతనానికి కారణాలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ఆస్ట్రేలియా పేరు వినగానే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. అలాంటి కంగారూల జట్టుకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న బలహీనత ఒకటుంది. అదే షార్ట్‌ ఫార్మాట్‌. టీ20 క్రికెట్‌ ఆరంభం నుంచే ఆస్ట్రేలియాకు పెద్దగా కలిసి రావడం లేదు. ఇప్పటివరకు జరిగిన అనేక టీ20 ప్రపంచకప్‌లలో కేవలం ఒక్కసారి మాత్రమే ఆ జట్టు విజేతగా నిలవడం దీనికి స్పష్టమైన ఉదాహరణ. తాజా టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆస్ట్రేలియా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. పైగా జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమి పాలై విమర్శలపాలైంది.

వివరాలు 

2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ నుంచే తడబాటు 

టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో ఆస్ట్రేలియా ఎప్పటికీ పటిష్ట జట్టే.కానీ టీ20ల్లో మాత్రం అడుగడుగునా తడబడుతోంది.

ఈ పరిస్థితి 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ నుంచే కొనసాగుతోంది.

ఆ తొలి టోర్నీలోనే జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది.

ఎందుకంటే ఆ రోజుల్లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాలంటే జట్లకు ధైర్యం చాలేది కాదు.

అలాంటి జట్టును కీలక ఆటగాళ్లు లేకపోయినా జింబాబ్వే ఓడించగలిగింది.

తొలి టోర్నీలో సెమీఫైనల్‌ వరకు చేరిన కంగారూలు 2009లో మాత్రం గ్రూప్‌ దశలోనే ఇంటిబాట పట్టారు.

2010లో మైకేల్‌ క్లార్క్‌ నాయకత్వంలో కాస్త మెరుగ్గా ఆడినా ఫైనల్లో ఓడి మళ్లీ నిరాశ మిగిల్చారు.

వివరాలు 

ఆరోన్‌ ఫించ్‌ కెప్టెన్సీలో తొలిసారి టీ20 ప్రపంచకప్

2012లో సెమీఫైనల్‌, 2014,2016 టోర్నీల్లో సూపర్‌-10 దశలకే పరిమితమైన ఆ జట్టుకు 2021లో మాత్రం అదృష్టం కలిసి వచ్చింది.

ఆరోన్‌ ఫించ్‌ కెప్టెన్సీలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

అయితే ఆ విజయం తాత్కాలికమే అన్నట్లుగా తర్వాతి టోర్నీల్లో మళ్లీ అదే తడబాటు కొనసాగింది.

2022లో సూపర్‌-12, 2024లో సూపర్‌-8 దశలకే పరిమితమైన ఆసీస్‌, ఈసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మరింత పేలవంగా ఆడింది.

జింబాబ్వే మెరుగైన ఆటతో సూపర్‌-8కు చేరగా, ఆస్ట్రేలియా మాత్రం లీగ్‌ దశలోనే నిష్క్రమించాల్సి వచ్చింది.

ADVERTISEMENT

వివరాలు 

స్మిత్‌ ఉంటే బ్యాటింగ్‌కు గట్టి ఆధారం

ఈ పరాజయాలకు జట్టు ఎంపికలో చేసిన తప్పిదాలు కూడా కారణమయ్యాయి.

టీ20 ప్రపంచకప్‌కు స్టీవ్‌ స్మిత్‌ వంటి కీలక ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పెద్ద లోపంగా మారింది.

ఉపఖండ పరిస్థితుల్లో మంచి రికార్డు ఉన్న స్మిత్‌ ఉంటే బ్యాటింగ్‌కు గట్టి ఆధారంగా నిలిచేవాడు.

స్టాయినిస్‌, మ్యాక్స్‌వెల్‌ వంటి ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు.

కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయి జట్టును ఇబ్బందుల్లోకి నెట్టారు.ఎంతో ఆశలు పెట్టుకున్న ట్రావిస్‌ హెడ్‌ కూడా ఈసారి తన మ్యాజిక్‌ను చూపించలేకపోయాడు.

ఆల్‌రౌండర్‌ గ్రీన్‌ ఆశించినంత ప్రభావం చూపలేదు. బౌలింగ్‌ విభాగంలోనూ పదును కనిపించలేదు.

కమిన్స్‌, హేజిల్‌వుడ్‌ వంటి ప్రధాన పేసర్లు లేకపోవడం బౌలింగ్‌ను మరింత బలహీనపరిచింది.

ADVERTISEMENT

వివరాలు 

బలమైన టీ20 జట్టును నిర్మించుకోవడంలో ఆస్ట్రేలియా విఫలం 

బౌలింగ్‌ ప్రణాళికలను సరిగా అమలు చేయకపోవడం, ఉపఖండ పరిస్థితులకు తగ్గట్టుగా తగిన మార్పులు చేసుకోలేకపోవడం కూడా ఆసీస్‌కు నష్టంగా మారింది.

ఆస్ట్రేలియా జట్టు ఎప్పటినుంచో దూకుడైన ఆటకు పేరు. కానీ టీ20ల్లో కేవలం దూకుడే సరిపోదు.

స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ అంశంలోనే ఆసీస్‌ ఎన్నేళ్లుగా వెనుకబడి ఉంది.

దిగ్గజ ఆటగాళ్లు రిటైరైన తర్వాత బలమైన టీ20 జట్టును నిర్మించుకోవడంలో ఆస్ట్రేలియా విఫలమైంది.

బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతుల్యత తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో కూడా టీ20ల్లో ఆస్ట్రేలియాకు చిన్న జట్ల చేతుల్లో పరాజయాలు తప్పేలా కనిపించడం లేదు.

ADVERTISEMENT