ఇది యుద్ధాల సమయం కాదు.. పాక్‌కు టీమిండియా రావాలి : షాహిద్ అఫ్రిది
ఆసియా కప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. సూమారు ఆరు నెలలగా ఈ వివాదంపై చర్చ నడుస్తూనే ఉంది.బీసీసీఐ కార్యదర్శి జైషా 2023 లో పాకిస్థాన్ లో జరగాల్సిన ఆసియా కప్ కోసం టీమిండియా ఆ దేశం వెళ్లదని ఇఫ్పటికే స్పష్టం చేశారు. జెషా కామెంట్స్‌కు అప్పటి పీసీబీ చీఫ్ రమీజ్ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నజమ్ సేథీ ఘాటుగానే స్పందించారు. భారత్ ఆసియా కప్ ఆడేందుకు పాకిస్థాన్‌కు రాకుంటే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కోసం పాక్ జట్టు ఇండియాకు రాబోదని వాళ్లు హెచ్చరించారు. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ఆడటానికి పాకిస్థాన్‌కు టీమిండియా రావాలని చెప్పారు.
భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
లెజెండ్స్ లీగ్ క్రికెట్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలు బలపడటానికి మొదటి అడుగు వేయాలని సూచించారు.ఇది యుద్ధాలు, పోరాటాలు చేసుకునే సమయం కాదన్నారు. గతంలో ఆసియా కప్-2008లో ఆడడానికి పాక్‌కు టీమిండియాకు వెళ్లిందని, టీ20 ప్రపంచ కప్-2016లో ఆడడానికి చివరిసారి భారత్ కు పాకిస్థాన్ వచ్చిందని గుర్తు చేశారు. టీమిండియాతో ఆడినప్పుడు తమకు అద్భుతమైన అనుభూతి లభించిందని, ఎంతో ప్రేమ, అప్యాయత చూపారన్నారు. భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లు కూడా పాకిస్తాన్ కు వచ్చి క్రికెట్ ఆడుతున్నాయని షాహిద్ ఆఫ్రిది స్పష్టం చేశాడు.