Abhishek Nayar: విరాట్ కోహ్లీ విజయాల వెనుక అసలు సీక్రెట్ ఇదే.. నాయర్ చెప్పిన ఆసక్తికర కథ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయాల వెనుక ఉన్న ప్రధాన బలం అతడి ఆటపై అతడికి ఉన్న అచంచలమైన విశ్వాసమేనని భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వెల్లడించాడు. కష్టకాలంలోనూ తన విధానాన్ని మార్చకుండా ముందుకు సాగే కోహ్లీ మైండ్‌సెట్‌నే అతడిని గొప్ప క్రికెటర్‌గా నిలబెట్టిందని పేర్కొన్నాడు. జియోస్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాయర్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో తాను భారత జట్టు సహాయక కోచ్ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, కోహ్లీతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నానని నాయర్ తెలిపాడు.
వివరాలు
ఇదంతా ఆటలో భాగమే
ఆ సమయంలో తాను కోహ్లీకి ఫోన్ చేసి, "అంతా బాగానే ఉందా? ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా?" అని అడిగానని ఆయన గుర్తుచేశాడు.
దానికి కోహ్లీ ఎంతో ప్రశాంతంగా స్పందిస్తూ.. అంతా బాగానే ఉంది. ఇదంతా ఆటలో భాగమేనని చెప్పాడని వివరించాడు.
ఆ తర్వాత కోహ్లీ బ్యాటింగ్‌లో ఒక సాంకేతిక అంశాన్ని గమనించానని, దానిపై తన అభిప్రాయం చెప్పాలనుకుంటున్నానని అనుమతి కోరినట్లు నాయర్ వెల్లడించాడు.
నేను ఒక విషయం గమనించాను... చెబితే వింటావా? అని అడిగితే, కోహ్లీ చిరునవ్వుతో "వద్దు... నేను నా పద్ధతిలోనే చేస్తానంటూ మర్యాదపూర్వకంగా తిరస్కరించాడని తెలిపాడు.
వివరాలు
విరాట్ సమాధానం నవ్వు తెప్పించింది
ఆ సమాధానం తనకు నవ్వు తెప్పించిందని, అయితే తర్వాతి మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ నుంచి తాను తన పద్ధతిలోనే చేశాను అనే సందేశం వచ్చిందని నాయర్ చెప్పాడు.
ఈ ఒక్క సంఘటనే విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని, అతడి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని నాయర్ అభిప్రాయపడ్డాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, ఎలా తిరిగి పుంజుకోవాలో గొప్ప ఆటగాళ్లకు బాగా తెలుసని పేర్కొన్నాడు.
మనం బయట నుంచి విశ్లేషించగలం, ఊహించగలం. కానీ అంతర్జాతీయ స్థాయిలో పదేపదే విజయాలు సాధించిన ఆటగాళ్లకు తమ ఆటపై స్పష్టమైన అవగాహన ఉంటుంది.
అందుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లంటే నాకు ఎంతో గౌరవమని అభిషేక్ నాయర్ వ్యాఖ్యానించాడు.