Rohit Sharma : మా విజయ రహస్యం ఇదే.. సెమీస్ కి అడుగుపెట్టాక రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో భారత్ జట్టు 160 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించి, లీగ్ స్టేజ్‌లో ఒక్క ఓటమీ లేకుండానే నాకౌట్‌కు చేరిన జట్టుగా అవతరించింది. లీగ్ స్టేజ్‌లో టీమిండియా ఆటతీరుపై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రీడాకారులు అద్భుతంగా రాణించారంటూ పోగడ్తలతో ముంచెత్తాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ విజయాల్లో కీలక పాత్ర పోషించారని, తాము ఒక్కో మ్యాచ్ పైనే దృష్టి పెట్టి, అందులో విజయం సాధించడానికి ఏం చేయాలనే దాని గురించే ఆలోచించామని పేర్కొన్నాడు.
అవసరానికి తగ్గట్టు టీం సభ్యులు రాణించారు : హిట్ మ్యాన్
ఇది సుదీర్ఘ టోర్నమెంట్ కాబట్టి చాలా దూరం చూడాలని ఎప్పుడూ అనుకోలేదని, విభిన్న వేదికల్లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాల్సి ఉంటుందని రోహిత్ శర్మ చెప్పాడు. తాము కూడా అలాగే ఆడామని, ముఖ్యంగా లీగ్ స్టేజ్‌లో అన్నింట్లోనూ విజయం సాధించడం ఆనందగా ఉందని, స్వదేశంలో చాలా ఆడడం వల్ల ఇక్కడి పరిస్థితులకు తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఛేజింగ్ చేసి విజయాలను సాధించామని, ఆ తర్వాత తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు స్కోరు బోర్డుపై ఓమోస్తరు పరుగులు ఉన్నా పేసర్లు గెలిపించారని కొనియాడారు. సీమర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థులపై ఆధిక్యం ప్రదర్శిస్తున్నారని రోహిత్ శర్మ అన్నాడు.