ఆ ముగ్గురి బౌలింగ్‌లో ఆడడం చాలా కష్టం : డివిలియర్స్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లకు కేరాఫ్ గా నిలిచి ఘనమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. గ్రౌండ్ నలువైపులా షాట్లు కొట్టి మిస్టర్ 360 డిగ్రీగా పేరు సంపాదించుకున్నాడు. అయితే అలాంటి ప్లేయర్ కూడా ముగ్గురు బౌలర్లను చూసి భయపడ్డారట. ఈ విషయాన్ని తాజాగా జియో సినిమాలో ఏబీ వెల్లడించారు. ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్, టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా, అప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లు తనను ఇబ్బంది పెట్టారని ఏబీ పేర్కొన్నారు. 2006లో తొలిసారి తాను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు షేన్ వార్న్ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డానని, అతని బౌలింగ్‌లో రాణించడం కష్టమనిపించిందన్నారు.
బుమ్రా ఛాలెంజింగ్ బౌలర్ : ఏబీ
ఇక టీమిండియా పేస్ స్టార్ బుమ్రాను ఒక ఛాలెంజింగ్ బౌలర్‌గా ఏబీ తెలిపాడు. బుమ్రా ఎల్లప్పుడూ పోటీనిస్తాడని, ఎప్పుడూ బ్యాటర్లకు తలవంచడని, అందుకే తనకు బుమ్రా అంటే గౌరవమని వెల్లడించారు. ఇక అప్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఒక అటాకింగ్ బౌలర్ అని, అతని బౌలింగ్‌లో చాలాసార్లు ఔట్ అయ్యానని, రషీద్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదితే నాలుగో బంతికి తనని ఔట్ చేసేందుకు ప్రయత్నించేవాడని ఏబీ వివరించారు. డివిలియర్స్ 138 వన్డే మ్యాచుల్లో 25 సెంచరీలను బాదాడు. ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి 5,030 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 38 హాఫ్ సెంచరీలున్నాయి.