LOADING...
Tilak Varma: భారత క్రికెట్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం 
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం

Tilak Varma: భారత క్రికెట్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు తిలక్ వర్మ దూరం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్‌ జట్టుకు ఊహించని గాయం ఎదురైంది. తెలుగు ఆటగాడు,మిడ్‌ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ఈ విషయాన్ని ఇంకా బీసీసీఐ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం,గాయం కారణంగా తిలక్ వర్మ పొట్టి సిరీస్‌లో పాల్గొనలేకపోతున్నాడు. భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్ జనవరి 21న ప్రారంభం కానుంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చెబుతున్నట్లుగా,తిలక్ వర్మ ప్రస్తుతం అబ్డొమన్ (పొత్తికడుపు) గాయంతో బాధపడుతున్నారు. ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి సమయం అవసరం. ఈ నేపధ్యంలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. తిలక్ గాయపడటంతో టీమిండియా మేనేజ్‌మెంట్ అతని స్థానంలో మరో ఆటగాడిని జట్టులో చేర్చే అవకాశాలను పరిశీలిస్తోంది.

వివరాలు 

పొత్తికడుపులో తీవ్ర నొప్పి

అయితే, టెస్టులు, వన్డేల్లో భారత కెప్టెన్‌గా ఉన్న శుభమన్ గిల్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉందని సమాచారం. ఈ ఖాళీకి ప్రధానంగా అస్సాం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ పేరు వినిపిస్తోంది. భుజం గాయం నుంచి అతను పూర్తిగా కోలితే, తిలక్ వర్మకు బదులుగా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మేనేజ్‌మెంట్ ఎవరికీ అవకాశం ఇస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తిలక్ వర్మ రాజ్‌కోట్‌లో జరుగుతున్న విజయ్‌హజారే ట్రోఫీలో పాల్గొంటున్నారు. బుధవారం ఉదయం అల్పాహారం అనంతరం అతడికి పొత్తికడుపులో తీవ్ర నొప్పి ఏర్పడడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ టెస్టులు నిర్వహించగా, నివేదికలను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్యులకు పంపారు.

వివరాలు 

తిలక్ వర్మ భారత జట్టులో లేకపోవడం భారీ నష్టం

వైద్యులు తిలక్ వర్మకు శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఈ శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాలు పడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల టీ20 ఫార్మాట్‌లో నిలకడగా ప్రదర్శిస్తున్న తిలక్ వర్మ భారత జట్టులో లేకపోవడం భారీ నష్టంగా భావిస్తున్నారు క్రికెట్ వర్గాలు. న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో సిరీస్‌కు ముందు ఈ గాయం టీమిండియాకు ఆందోళన కలిగిస్తోంది. అభిమానులు తిలక్ త్వరగా కోలుకుని మళ్లీ జట్టులోకి రావాలని ఆశిస్తున్నారు. భారత జట్టు ఆందోళన ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ కన్నా ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే టీ20 వరల్డ్‌కప్‌పై ఎక్కువ. ముఖ్య టోర్నమెంట్ కోసం తిలక్ అందుబాటులో ఉంటాడా? అన్నది ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను పెద్దగా ఆలోచింపజేస్తోంది.

Advertisement