Sri Lankan Coach : క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. ఆటగాళ్ల ఘర్షణలో మాజీ కోచ్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొలంబోలో జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో తీవ్రంగా గాయపడిన 62 ఏళ్ల క్రికెట్ కోచ్ సుమిత్ ఫెర్నాండో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన గతంలో శ్రీలంక మాజీ కెప్టెన్ కుశాల్ మెండిస్‌కు పాఠశాల స్థాయిలో కోచ్‌గా వ్యవహరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్టు 8న ఓ క్రీడా ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న కొంతమంది యువ క్రికెటర్లు తాగునీటి కోసం వెళ్లారు. అయితే అక్కడ నీటి వసతి అందుబాటులో లేకపోవడంతో ఆటగాళ్లకు, స్టేడియం సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫెర్నాండో పరిస్థితిని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకున్నారు.
వివరాలు
చికిత్స పొందుతూ మృతి
ఆయన బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్‌లో క్యూరేటర్‌గా కూడా పనిచేశారు.ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో ఫెర్నాండో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స కోసం కొలంబో జాతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు.
ఈ ఘటనకు సంబంధించి 17 ఏళ్ల క్రికెటర్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
అతడిని మంగళవారం కొలంబో కోర్టులో హాజరుపరచగా.. ఆగస్టు 17 వరకు బాలల ప్రొబేషన్ కస్టడీకి పంపించారు.
వివరాలు
మాజీ కోచ్‌గా పనిచేసిన అనుభవం
మొరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో మాజీ కోచ్‌గా పనిచేసిన ఫెర్నాండో.. పలువురు పాఠశాల స్థాయి క్రికెటర్ల ప్రతిభను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన శిక్షణ ఇచ్చిన ఆటగాళ్లలో కుశాల్ మెండిస్ కూడా ఉన్నారు.
మెండిస్ అనంతరం శ్రీలంక వన్డే కెప్టెన్‌గా ఎదిగారు. కోచింగ్ బాధ్యతల అనంతరం ఫెర్నాండో.. శ్రీలంక దేశీయ క్రికెట్ వ్యవస్థలో ప్రముఖ క్లబ్‌గా ఉన్న బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ & అథ్లెటిక్ క్లబ్‌లో గ్రౌండ్స్ క్యూరేటర్‌గా పనిచేశారు.