SL Akshay : మైదానంలో విషాదం.. మ్యాచు ఆడుతుండగా ప్రాణాలు కోల్పోయిన క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఎస్‌ఎల్ అక్షయ్ మ్యాచ్ ఆడుతుండగానే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు, క్రికెట్ అధికారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శివమొగ్గకు చెందిన 39 ఏళ్ల అక్షయ్ బెంగళూరులోని కేఆర్‌పురంలో ఆదివారం జరిగిన మూడో డివిజన్ లీగ్ మ్యాచ్‌లో పాల్గొంటుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పిన ఆయన క్షణాల్లోనే మైదానంలో పడిపోయాడు. వెంటనే సహచర ఆటగాళ్లు అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు ప్రకటించారు.
వివరాలు
అక్షయ్ ఆత్మకు శాంతి చేకూరాలి
అక్షయ్ మృతిపై కర్ణాటక మాజీ పేసర్ దొడ్డ గణేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "క్రికెట్ ప్రపంచానికి ఇది ఎంతో బాధాకరమైన వార్త. అండర్-19 రోజుల నుంచే అక్షయ్‌ను నేను చూస్తున్నాను. 39 ఏళ్ల ఈ పేసర్ డివిజన్ మ్యాచ్ ఆడుతుండగానే కన్నుమూశాడు. ఎంతో మృదుభాషి అయిన వ్యక్తిని కోల్పోయాం. అక్షయ్ ఆత్మకు శాంతి చేకూరాలి" అని ఆయన పేర్కొన్నారు. ఇక కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కూడా అక్షయ్ మృతిపై అధికారిక ప్రకటన విడుదల చేసి నివాళులర్పించింది. కర్ణాటక క్రికెట్‌కు ఆయన అందించిన సేవలను సంఘం ప్రశంసించింది. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారి రాష్ట్రవ్యాప్తంగా యువ క్రికెటర్ల అభివృద్ధికి ఆయన చేసిన కృషి విశేషమని పేర్కొంది.