Rowing Cup: వరల్డ్ రోయింగ్ కప్‌లో భారత చరిత్రాత్మక విజయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆర్మీకి చెందిన ఉజ్వల్ కుమార్, లక్షయ్ అంతర్జాతీయ రోయింగ్ వేదికపై దేశానికి అపూర్వ విజయాన్ని అందించారు. 2026 వరల్డ్ రోయింగ్ కప్-IIIలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని భారత క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. వరల్డ్ రోయింగ్ కప్ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం. లైట్ వెయిట్ పురుషుల డబుల్ స్కల్స్ ఫైనల్‌లో పోటీపడిన భారత జోడీ 6 నిమిషాల 26.09 సెకన్లలో రేసును పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. హాంకాంగ్ జట్టు 6 నిమిషాల 27.14 సెకన్లతో రెండో స్థానాన్ని, నెదర్లాండ్స్ జట్టు 6 నిమిషాల 27.36 సెకన్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి.
వివరాలు
ఉజ్వల్ కుమార్, లక్షయ్ కు స్వర్ణం..
స్వర్ణ విజేతలైన ఉజ్వల్ కుమార్, లక్షయ్ ఇద్దరూ భారత ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ కోసం లాసెర్న్‌కు వెళ్లిన 18 మంది సభ్యుల భారత జట్టులో 17 మంది ఆర్మీకి చెందిన క్రీడాకారులే ఉండటం విశేషం. మిగిలిన ఒకరు భారత నౌకాదళానికి చెందిన అథ్లెట్. గత కొన్ని సంవత్సరాలుగా రోయింగ్ క్రీడ అభివృద్ధిపై భారత సైన్యం గణనీయంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు క్రీడాకారులకు అత్యాధునిక సదుపాయాలు, అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఉజ్వల్ కుమార్, లక్షయ్ అసాధారణ ప్రతిభను కనబరిచి ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. వారి విజయంతో భారత్ వరల్డ్ రోయింగ్ కప్ చరిత్రలో చిరస్మరణీయ మైలురాయిని నమోదు చేసింది.