
BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్‌ను ఓడిస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని రాసింది. మే 19న షార్జాలో జరిగిన రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో యూఏఈ 2 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి సంచలనం రేపింది. ఈ విజయంతో యూఏఈ పలు రికార్డులను సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ, మ్యాచ్‌లో ఏ దశలోనూ వెనకడుగు వేయకుండా, చివరకు ఒక్క బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాచ్ విజయంలో యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం కీలక పాత్ర పోషించారు.
Details
వసీం ధాటికి బంగ్లా బెంబేలెత్తింది
యూఏఈ ఇన్నింగ్స్‌ను ఓపెనర్‌గా ప్రారంభించిన వసీం, అద్భుతంగా ఆడి తన జట్టుకు విజయానికి బలమైన బాట వేశాడు. అతను 42 బంతుల్లోనే 82 పరుగులు బాదేశాడు. ఇందులో 9 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయి. 195.23 స్ట్రైక్ రేట్‌తో ఆడిన వసీం, 14.5 ఓవర్లలో తన జట్టును 148 పరుగుల వద్దకు చేర్చాడు. అతను ఔట్ అయిన తర్వాత మిగిలిన ఆటగాళ్లు చక్కటి సమన్వయంతో విజయాన్ని సులభతరం చేశారు.
Details
చరిత్రలో స్థానం దక్కించుకున్న యూఏఈ
ఈ మ్యాచ్‌తో యూఏఈ క్రికెట్ చరిత్రలో మూడు ముఖ్య ఘనతలు సొంతం చేసుకుంది. 1.టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన మొదటి విజయంగా ఇది నిలిచింది. 2.పూర్తి సభ్యదేశమైన బంగ్లాదేశ్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తొలిసారి అసోసియేట్ జట్టుగా రికార్డు సృష్టించింది. 3.టీ20ఐ ఫార్మాట్‌లో 200కిపైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తొలి సందర్భమిది యూఏఈకి. 1994 ఐసీసీ ట్రోఫీ, 1996 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలోనూ వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన అనుభవం యూఏఈకి ఉంది. కానీ, తాజా విజయంతో 29 సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ను మళ్లీ ఓడించిన ఘనతను అందుకుంది. ఈ విజయంతో బంగ్లాదేశ్‌తో ద్వితీయ టీ20 సిరీస్‌ను యూఏఈ 1-1తో సమం చేసింది.