UAE Vs NZ : టీ20లో చరిత్ర సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
టీ20లో పసికూన యూఏఈ జట్టు సంచలనం సృష్టించింది. న్యూజిలాండ్ పై యూఏఈ జట్టు గెలుపొందింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20ల్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి యూఏఈ జట్టు చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌పై యూఏఈకి ఇదే తొలి విజయం కావడం గమానార్హం. ఈ గెలుపుతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కివీస్ ఒకానొక దశలో 65 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయింది. కనీసం 100 పరుగులైనా న్యూజిలాండ్ జట్టు చేరుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
హాఫ్ సెంచరీతో రాణించిన మహ్మద్ వసీం
అయితే చివర్లో చాప్‌మన్ 63 పరుగులు, నీషమ్ 21 పరుగులు చేయడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది. యూఏఈ బౌలర్లలో ఆయాన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన యూఏఈ 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆ జట్టు కెప్టెన్ మహ్మద్ వసీం 29 బంతుల్లో 55, ఆసిఫ్ ఖాన్ 48, అరవింద్ 25 పరుగులతో రాణించి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక మూడు వికెట్లతో రాణించిన ఆయాన్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.