Loading...
Vaibhav Suryavanshi: వైభవ్‌ విధ్వంసం.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, వరల్డ్ రికార్డు బద్దలు!
వైభవ్‌ విధ్వంసం.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, వరల్డ్ రికార్డు బద్దలు!

Vaibhav Suryavanshi: వైభవ్‌ విధ్వంసం.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, వరల్డ్ రికార్డు బద్దలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2026
09:12 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్ పర్యటనలో భారీ అంచనాల మధ్య అరంగేట్రం చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొన్న 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ.. జింబాబ్వే గడ్డపై మాత్రం తన అసలైన సత్తా చూపించాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు పేసర్ మయాంక్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ విజయం.

వివరాలు 

చెల‌రేగిన వైభ‌వ్ సూర్య‌వంశీ

జింబాబ్వే పర్యటనను టీమ్ ఇండియా విజయంతో ప్రారంభించింది.

గురువారం జరిగిన తొలి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన ముందు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది.

వెస్లీ మధెవెరె 34 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ తరఫున మయాంక్ యాదవ్ 2 వికెట్లకు 18 పరుగులు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లకు 19 పరుగులు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశారు.

126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వైభవ్ సూర్యవంశీ తుఫాన్ ఆరంభం అందించాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు.

వివరాలు 

వైభవ్ విధ్వంసం.. విమర్శలకు బ్యాట్‌తో సమాధానం

ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 35 పరుగులతో అండగా నిలవగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

తిలక్ వర్మ (6 నాటౌట్)తో కలిసి శ్రేయస్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన తర్వాత భారీ అంచనాలతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడ మూడు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో అతడి అంతర్జాతీయ స్థాయి సన్నద్ధతపై విమర్శలు వచ్చాయి.

అయితే జింబాబ్వేలో ఆ అనుమానాలన్నింటికీ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

ఈ ఏడాది అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు చేసిన అదే వేదికపై మరోసారి చెలరేగిపోయాడు.

ADVERTISEMENT

వివరాలు 

మయాంక్ యాదవ్ పేస్‌కు జింబాబ్వే విలవిల

భారత్ తరఫున 2024 అక్టోబర్ తర్వాత మళ్లీ బరిలోకి దిగిన మయాంక్ యాదవ్ తన పేస్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు.

గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ మ్యాచ్ తొలి బంతికే బ్రయాన్ బెనెట్‌ను పెవిలియన్‌కు పంపాడు.

ఐదో ఓవర్లో మయర్స్ (6)ను కూడా అవుట్ చేశాడు. మరో పేసర్ ప్రిన్స్ యాదవ్ బెన్ కరన్ (10) వికెట్ పడగొట్టగా, శివమ్ దూబే సికందర్ రజా (4)ను అవుట్ చేయడంతో జింబాబ్వే 32/4తో కష్టాల్లో పడింది.

ఆ దశలో వెస్లీ మధెవెరె జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

ముందుగా ర్యాన్ బర్ల్ (26)తో ఐదో వికెట్‌కు 32 పరుగులు జోడించాడు. బిష్ణోయ్ బర్ల్‌ను అవుట్ చేయడంతో ఆ భాగస్వామ్యం ముగిసింది.

ADVERTISEMENT

వివరాలు 

'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మయాంక్

అనంతరం మరుమని (27 నాటౌట్)తో ఆరో వికెట్‌కు 58 పరుగులు జోడించి స్కోరును 125కు చేర్చాడు. అయితే చివరి ఓవర్లో మధెవెరె కూడా వెనుదిరిగాడు.

రెండు కీలక వికెట్లు తీసి జింబాబ్వేను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మయాంక్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్స‌ అవార్డు లభించింది.

ఈ మ్యాచ్‌తో పేసర్ అశోక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉండగా, రెండో టీ20 శనివారం జరగనుంది.

వివరాలు 

వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు

ఈ మ్యాచ్‌లో కేవలం 15 ఏళ్ల 118 రోజుల వయసులో అర్ధశతకం సాధించిన వైభవ్ సూర్యవంశీ.. పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఈ క్రమంలో నేపాల్ యువ ఆటగాడు కుశాల్ మల్లా (15 ఏళ్ల 340 రోజులు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ ఇన్నింగ్స్‌తో తనపై వచ్చిన అన్ని అనుమానాలకు వైభవ్ గట్టి సమాధానం ఇచ్చాడు.

ADVERTISEMENT