LOADING...
Vaibhav Sooryavanshi: మరోసారి అదే తప్పిదం.. మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్న వైభవ్ సూర్యవంశీ
మరోసారి అదే తప్పిదం.. మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi: మరోసారి అదే తప్పిదం.. మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్న వైభవ్ సూర్యవంశీ

వ్రాసిన వారు Moogati Shabari
Jun 11, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఆకట్టుకునే ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై-సిరీస్‌లో అఫ్గానిస్థాన్-Aతో జరిగిన మ్యాచ్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో మెప్పించిన అతడు, అర్ధశతకానికి చేరువలో అనవసర షాట్ ఆడి వికెట్ చేజార్చుకున్నాడు. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్-A జట్టు ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో భారత్-A తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ మొదటి నుంచే వేగవంతమైన ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా వైభవ్ తన సహజ దూకుడు ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ వరుస బౌండరీలు సాధించాడు.

వివరాలు

44 పరుగులకు ఔట్..

కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు బాదిన వైభవ్ 44 పరుగులు నమోదు చేశాడు. 200 స్ట్రైక్‌రేట్‌తో అఫ్గాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన అతడు సులభంగా అర్ధశతకం దిశగా సాగుతున్నట్లు కనిపించాడు. అయితే 7.1వ ఓవర్‌లో అబ్దొల్లా అహ్మద్‌జాయ్ వేసిన షార్ట్‌పిచ్ బంతిని వికెట్‌కీపర్‌పైగా ర్యాంప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వైభవ్, బంతి వేగాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బ్యాట్‌కు స్వల్పంగా తాకిన బంతి నేరుగా వికెట్‌కీపర్ మొహమ్మద్ ఇషాక్ చేతుల్లోకి వెళ్లడంతో అతడి ఇన్నింగ్స్ 44 పరుగుల వద్ద ముగిసింది.

వివరాలు

వైభవ్‌కు ఎదురవుతున్న సమస్య అదే..

మంచి ఆరంభాలు దక్కుతున్నప్పటికీ వాటిని పెద్ద ఇన్నింగ్స్‌లుగా మార్చుకోలేకపోవడం వైభవ్‌కు వరుసగా ఎదురవుతున్న సమస్యగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి కీలక సమయంలో వికెట్ కోల్పోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే వైభవ్ ఆడిన వేగవంతమైన ఇన్నింగ్స్ భారత్-Aకు బలమైన ఆరంభాన్ని అందించింది. అతడు ఔటైన సమయానికి జట్టు స్కోరు 7.2 ఓవర్లలో 74 పరుగులుగా ఉంది. మరో ఎండ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 28 పరుగులతో క్రీజులో నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్..

Advertisement