Loading...
Varanasi Cricket Stadium: శివుడి రూపంలో స్టేడియం...ఢమరుకం ఎంట్రన్స్‌..అదిరింది గురూ
శివుడి రూపంలో స్టేడియం...ఢమరుకం ఎంట్రన్స్‌..అదిరింది గురూ

Varanasi Cricket Stadium: శివుడి రూపంలో స్టేడియం...ఢమరుకం ఎంట్రన్స్‌..అదిరింది గురూ

వ్రాసిన వారు Balachander Sharma
Nov 19, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

వారణాసిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. కాశీ ఆధ్యాత్మికత, శివుడి ప్రతీకలు కనిపించేలా నిర్మిస్తున్న ఈ మైదానం త్వరలో క్రికెట్‌ అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. నవంబర్‌ 18న ఐసీసీ అధ్యక్షుడు జై షా స్టేడియాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. మైదానం, పిచ్‌లు, ఆటగాళ్ల గదులు, గ్యాలరీలు, వీఐపీ లాంజ్‌ తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యంగా డమరుకం ఆకారంలో రూపొందిస్తున్న మీడియా సెంటర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ఆయన కూడా ఆసక్తిగా పరిశీలించారు.

Details

శివుడి ప్రతీకలతో ప్రత్యేక డిజైన్

ఈ స్టేడియం గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది దాని నిర్మాణ శైలే. సాధారణ క్రికెట్‌ మైదానాలకు భిన్నంగా కాశీ సంస్కృతిని ప్రతి భాగంలోనూ చూపించేలా డిజైన్‌ చేశారు.

మీడియా సెంటర్‌ను శివుడి డమరుకం ఆకారంలో రూపొందిస్తుండగా.. ఫ్లడ్‌లైట్‌ టవర్లను త్రిశూలం తరహాలో తీర్చిదిద్దుతున్నారు. పైకప్పులో చంద్రవంక ఆకృతి కనిపించనుంది.

ప్రేక్షకుల గ్యాలరీలు వారణాసి ఘాట్ల మెట్లను గుర్తు చేసేలా ఉండనున్నాయి. స్టేడియం వెలుపల బిల్వపత్రం ఆకారంలోని లోహపు పలకలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

Details

రూ.450 కోట్లతో 30 వేల సీట్లు

గంజారి ప్రాంతంలో 30 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. భూసేకరణ ఖర్చుతో కలిపి మొత్తం ప్రాజెక్టు విలువ సుమారు రూ.450 కోట్లు.

దాదాపు 30 వేల మంది ఒకేసారి మ్యాచ్‌ను వీక్షించేలా సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన మైదానంలో తొమ్మిది పిచ్‌లు, ప్రాక్టీస్‌ గ్రౌండ్‌లో మరో ఐదు పిచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

డ్రెస్‌ రూమ్‌లు, జిమ్‌, డగౌట్లు, మీడియా సెంటర్‌, కార్పొరేట్‌ బాక్సులు, పార్కింగ్‌ వంటి సదుపాయాలను కూడా ఆధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు.

ADVERTISEMENT

Details

వర్షం వచ్చినా ఆటకు అంతరాయం తక్కువే

స్టేడియంలోని డ్రైనేజీ వ్యవస్థ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశమే. ఒకేసారి 100 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసినా నీటిని వేగంగా బయటకు పంపేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.

వర్షం ఆగిన తర్వాత కేవలం 20 నుంచి 25 నిమిషాల్లో మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేసే సామర్థ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఈ సదుపాయం ముఖ్యంగా వర్షాకాల మ్యాచ్‌లకు ఉపయోగపడే అవకాశం ఉంది. దీంతో వాతావరణం కారణంగా ఆట ఎక్కువసేపు నిలిచిపోయే పరిస్థితులను తగ్గించవచ్చని భావిస్తున్నారు.

ADVERTISEMENT

Details

నవంబర్‌ 30లోగా పనులు పూర్తి

స్టేడియంలో మిగిలిన నిర్మాణ పనులను నవంబర్‌ 30లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.

నవంబర్‌ 19 నుంచి ప్రధాన మైదానం, ప్రాక్టీస్‌ గ్రౌండ్‌లో పిచ్‌ల తయారీ పనులు ప్రారంభం కానున్నాయి.

పిచ్‌ల నాణ్యతను పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. డిసెంబర్‌లో స్టేడియం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

డిసెంబర్‌ 2న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారనే వార్తలు గతంలో వచ్చినా.. అధికారిక తేదీపై ఇంకా స్పష్టత లేదు. ప్రారంభం తర్వాత దేశవాళీతో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఈ స్టేడియం వేదిక కావాలన్నది లక్ష్యం.

ADVERTISEMENT