LOADING...
Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఆసియా క్రీడల ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్
వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఆసియా క్రీడల ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్

Vinesh Phogat: వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. ఆసియా క్రీడల ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2026
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల ట్రయల్స్‌-2026లో పాల్గొనే విషయంలో భారత రెజ్లింగ్ స్టార్ వినేశ్ ఫొగాట్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సెలక్షన్ ట్రయల్స్‌లో పోటీ చేసేందుకు ఆమెకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ దశలో ఆమెను వెనక్కి వెళ్లమని చెప్పడం సరైనది కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇటీవల దిల్లీ హైకోర్టు మే 30, 31తేదీల్లో జరిగే ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్‌లో వినేశ్ ఫొగాట్ పాల్గొనేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు తన పరిధిని మించి వ్యవహరించిందని, ఎంపిక ప్రమాణాల ప్రకారం వినేశ్ అర్హత సాధించకపోయినా ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతించిందని డబ్ల్యూఎఫ్‌ఐ తన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో పేర్కొంది.

వివరాలు

ఆమె ట్రయల్స్‌లో పాల్గొనవచ్చు

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. "ఈ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. కానీ వినేశ్ ఈ దేశాన్ని గర్వపడేలా చేశారు. ఇప్పటికే హైకోర్టు ఆమెకు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. ఇప్పుడు ఆమెను వెనక్కి వెళ్లమని చెప్పడం సరైన నిర్ణయం కాదనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. "ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఈ విషయంలో జోక్యం చేసుకోలేం. ఆమె ట్రయల్స్‌లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వివరాలు

విచారణ వచ్చే వారానికి వాయిదా

అయితే డబ్ల్యూఎఫ్‌ఐ దాఖలు చేసిన పిటిషన్‌పై వినేశ్ ఫొగాట్‌కు నోటీసులు జారీ చేసిన కోర్టు, తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అదే సమయంలో దిల్లీ హైకోర్టు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి అంశాల్లో కోర్టులు వేగంగా జోక్యం చేసుకోవడం సరైంది కాదని అభిప్రాయపడింది.

Advertisement