
Vinod Kambli : మాజీ భారత స్టార్ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితిపై అతడి సోదరుడు ఏం చెప్పాడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ వినోద్ కాంబ్లీ అనారోగ్య కారణంగా ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతున్నారని అతడి సోదరుడు వీరేంద్ర కాంబ్లీ వెల్లడించారు. ప్రస్తుతానికి కాంబ్లీ బాంద్రాలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడని, అయితే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడని వీరేంద్ర తెలిపారు. "వినోద్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇంట్లోనే చికిత్స కొనసాగుతోంది. అతడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. కోలుకోవడానికి సమయం పడుతుంది. అయినప్పటికీ, అతడు ఒక నిజమైన చాంపియన్. త్వరలో కోలుకొని మళ్లీ మైదానంలో కనిపిస్తాడు. నడవడం, పరిగెత్తడం మళ్లీ ప్రారంభిస్తాడని ఆశిస్తున్నాను. అతడిపై నాకు చాలా నమ్మకం ఉంది. అభిమానులు కూడా మళ్లీ అతడిని మైదానంలో చూడగలరని ఆశిస్తున్నాను" అని వీరేంద్ర కాంబ్లీ చెప్పారు.
వివరాలు
గతేడాది తీవ్రమైన అనారోగ్యంతో..
కాంబ్లీ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని అతని అభిమానులకు వీరేంద్ర విజ్ఞప్తి చేశాడు. "ఇటీవల వినోద్‌కు పూర్తి శరీర, మెదడు స్కాన్, మూత్ర పరీక్షలు జరిపారు. పెద్దగా సమస్యలు లేవు. అయితే నడవలేకపోతున్నాడు. కాబట్టి ఫిజియోథెరపీ చేయించుకోవడం అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతానికి అతడికి అందరి మద్దతు, ప్రేమ అత్యంత అవసరం" అని వీరేంద్ర పేర్కొన్నారు. గతేడాది కాంబ్లీ తీవ్ర అనారోగ్యంతో బాధపడిన సంగతి తెలిసిందే. అతడికి తీవ్ర మూత్రనాళ ఇన్ఫెక్షన్ తలెత్తడంతో థానేలోని ఆకృతి హాస్పిటల్‌లో చేరవేశారు. వైద్య పరీక్షల్లో అతడి మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం గుర్తించారు. దీనివల్ల ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్స అందించారు. కొంత కోలుకున్న తర్వాత డిశార్జ్ చేశారు.
వివరాలు
కాంబ్లీ క్రికెట్ కెరీర్
వినోద్ కాంబ్లీ 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2000 వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్‌లో మొత్తం 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 54.2 సగటుతో 1084 పరుగులు సాధించాడు, ఇందులో నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 32.6 సగటుతో 2477 పరుగులు చేశాడు, ఇందులో రెండు సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.