37 టెస్టు ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయని విరాట్ కోహ్లీ
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును అధిగమించే క్రికెటర్ విరాట్ కోహ్లీనే అని క్రికెట్ దిగ్గజాలు చెబుతుంటారు. అయితే టెస్టులో మాత్రం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. గత 37 టెస్టు ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ కూడా చేయకపోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. నాగ్‌పూర్‌లో శుక్రవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 12 పరుగులకే ఔట్ కావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఛెతేశ్వర్ పుజారా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. రెండు ఫోర్లు కొట్టి పెవిలియానికి వెళ్లాడు. టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీపై ప్రస్తుతం నిరీక్షణ మొదలైంది.
మొదటి టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టిన టాడ్ మర్ఫీ
లంచ్ తర్వాత తొలి బంతికే మర్ఫీ బౌలింగ్‌లో కోహ్లి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం స్పిన్నర్ టాడ్ మర్ఫీ నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కోహ్లి తన చివరి సెంచరీని 2019లో బంగ్లాదేశ్‌పై కొట్టాడు. అప్పటి నుండి టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 79 పరుగులు కావడం విశేషం. కోహ్లి 37 ఇన్నింగ్స్‌లలో 25.80 సగటుతో 929 పరుగులు చేయగలిగాడు. ఇందులో ఆరు అర్ధశతకాలు సాధించాడు. కోహ్లి చివరి ఐదు ఇన్నింగ్స్‌లు వరుసగా 1, 19*, 24, 1, 12 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 21 మ్యాచ్‌ల్లో 47.05 సగటుతో 1,694 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు.