LOADING...
Virat Kohli Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ అకౌంట్ అదృశ్యం.. హెల్ప్‌డెస్క్‌గా అనుష్క అకౌంట్
హెల్ప్‌డెస్క్‌గా అనుష్క అకౌంట్

Virat Kohli Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ అకౌంట్ అదృశ్యం.. హెల్ప్‌డెస్క్‌గా అనుష్క అకౌంట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిన ఘటన ఇది. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అనూహ్యంగా డీయాక్టివేట్ కావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. 27 కోట్ల 40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న కింగ్ కోహ్లీ ఇన్‌స్టా ప్రొఫైల్ శుక్రవారం (జనవరి 30) ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 'Virat Kohli' అని సెర్చ్ చేస్తే ప్రొఫైల్ కనిపించకపోవడమే కాకుండా 'దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్', 'ది లింక్ మే బీ బ్రోకెన్' వంటి సందేశాలు దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, విరాట్ సోదరుడు వికాస్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా సెర్చ్‌లో కనిపించకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాలు 

అనుష్క అకౌంట్ ఓ హెల్ప్‌డెస్క్‌లా..

విరాట్ కోహ్లీ అకౌంట్ అకస్మాత్తుగా మాయమవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా పెద్ద సాంకేతిక సమస్య తలెత్తిందా?లేక కోహ్లీ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే విరాట్‌కు చెందిన 'ఎక్స్'అకౌంట్ మాత్రం ఇప్పటికీ యాక్టివ్‌లోనే ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై కోహ్లీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోవడంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో నటి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అభిమానుల ప్రశ్నలతో నిండిపోయింది. 'విరాట్ అకౌంట్ ఏమైంది?','భాభీ ప్లీజ్ చెప్పండి'అంటూ వేలాది కామెంట్లు వరుసగా వస్తున్నాయి. ఒక దశలో అనుష్క అకౌంట్ ఓ హెల్ప్‌డెస్క్‌లా మారిపోయింది.అయితే ఇంతటి హడావుడి మధ్య కూడా అనుష్క ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

వివరాలు 

కోహ్లీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే..

ఇటీవలి కాలంలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు తమ వ్యక్తిగత జీవితం, కుటుంబ గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ విషయంలోనూ వారు మౌనంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరి నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేకపోవడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇది తాత్కాలిక విరామమేనని కొందరు అభిమానులు భావిస్తే, ఇన్‌స్టాగ్రామ్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశాడేమోనని మరికొందరు చర్చించుకుంటున్నారు. అసలు నిజం ఏంటన్నది తెలియాలంటే మాత్రం కోహ్లీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఆసియా ఖండంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రోనాల్డో, లియోనెల్ మెస్సి తర్వాత క్రీడా ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

Advertisement