ఆస్ట్రేలియాపై కోహ్లీ సాధించిన రికార్డులపై ఓ లుక్కేయండి
ఇటీవల వన్డేల్లో సూపర్ ఫామ్ ను అందుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో సత్తా చాటాడు. దీంతో తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో ప్రస్తుతం కోహ్లీపై అంచనాలు పెరిగిపోయాయి. మర్చి 17న వాంఖేడ్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీకి పూనకాలే అని చెప్పొచ్చు. కోహ్లి ఆస్ట్రేలియాతో 43 వన్డేల్లో ఆడి 2,083 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 3,077 పరుగులతో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తర్వాతి స్థానంలో డెస్మండ్ హేన్స్ (2,262), రోహిత్ శర్మ (2,208) ఉన్నారు.
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ
స్వదేశంలో ఆస్ట్రేలియాతో 23 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 59.95 సగటుతో 1,199 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై రెండవ అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన బ్రియాన్ లారా (4,714)ను కోహ్లీ అధిగమించారు. 6,707 పరుగులతో సచిన్ టెండుల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంటర్నేషనల్ వన్డేల్లో 13,000 పరుగుల మైలురాయి దాటుకోవడానికి విరాట్ కోహ్లీ 191 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 262 వన్డేల్లో 12,809 పరుగులు చేశాడు. వన్డేల్లో కింగ్ కోహ్లీ ఆసీస్‌పై ఎనిమిది సెంచరీలను బాదాడు. తాజా ఈ వన్డే సిరీస్‌లో మరో సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్ (9) రికార్డును కోహ్లీ సమం చేస్తాడు.