LOADING...
Virat Kohli: 'ప్రతి సీజన్ ఓ యుద్ధంలా అనిపించింది'.. ఆర్‌సీబీ ప్రయాణంపై కోహ్లీ స్పందన
'ప్రతి సీజన్ ఓ యుద్ధంలా అనిపించింది'.. ఆర్‌సీబీ ప్రయాణంపై కోహ్లీ స్పందన

Virat Kohli: 'ప్రతి సీజన్ ఓ యుద్ధంలా అనిపించింది'.. ఆర్‌సీబీ ప్రయాణంపై కోహ్లీ స్పందన

వ్రాసిన వారు Moogati Shabari
May 16, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన హృదయంలో దాచుకున్న భావాలను అభిమానులతో పంచుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 18 సంవత్సరాల నిరీక్షణ అనంతరం 2025లో ఐపీఎల్ టైటిల్‌ను అందుకోవడం తన జీవితంలో ఎంత ప్రత్యేకమో తాజాగా ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. తన క్రికెట్ కెరీర్ ముగిసేలోపు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడం తనకు అత్యంత భావోద్వేగపూరితమైన, మరపురాని క్షణమని కోహ్లీ పేర్కొన్నాడు.

వివరాలు

ఆ అనుభూతి మాటల్లో చెప్పడం కష్టం..

ఆ విజయానంతరం తనలో కలిగిన భావాలను గుర్తు చేసుకుంటూ.. "ఆ సమయంలో నా మనసులో ఏం నడిచిందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి, 'దేవుడా.. నేను క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేలోపు ఈ అనుభూతిని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు' అని ప్రార్థించాను" అని కోహ్లీ తెలిపాడు. గత ఏడాది జూన్ 3న మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించి ఆర్‌సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకున్న కోహ్లీ.. 2008 నుంచి ఈ జట్టుతో కొనసాగుతూ, కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఎన్నోసార్లు ట్రోఫీకి చేరువై కూడా విజయాన్ని చేజార్చుకోవాల్సి వచ్చిందన్నాడు.

వివరాలు

కోహ్లీ భావోద్వేగం..

"ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్‌లో మిగిలిన నాలుగు బంతులు జరుగుతున్న సమయంలో నా గుండెల్లో ఎంత టెన్షన్, భావోద్వేగం నిండిపోయిందో చెప్పడం అసాధ్యం. బయటివారికి ఆర్‌సీబీ ఒక పెద్ద ఫ్రాంచైజీగా కనిపించొచ్చు. కానీ టైటిల్ గెలవలేకపోయిన జట్టుగా, ఫైనల్‌ వరకు వెళ్లి ఆగిపోయే టీమ్‌గా మాపై ఒక ముద్ర పడింది. ప్రతి ఏడాది ఆ ఒత్తిడిని మోస్తూ రావడం చాలా కఠినమైన విషయం. దాన్ని బయట నుంచి చూడటం ఒకటి.. ప్రత్యక్షంగా అనుభవించడం మరోటి. నేను ఆ ప్రతి సీజన్‌ను పూర్తిగా అనుభవించాను" అంటూ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.

Advertisement