LOADING...
Washington Sundar: జట్టు కోసం ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధమే: వాషింగ్టన్‌ సుందర్‌ 
జట్టు కోసం ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధమే: వాషింగ్టన్‌ సుందర్

Washington Sundar: జట్టు కోసం ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధమే: వాషింగ్టన్‌ సుందర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2025
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

జట్టుకు అవసరమైతే తాను నంబర్‌-3తో పాటు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధమేనని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ చెప్పారు. కోల్‌కతా టెస్ట్‌లో అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గువాహటి టెస్ట్‌లో మాత్రం మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో క్రీజులోకి దిగాడు. కోల్‌కతా టెస్ట్‌లో సుందర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 82 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో 92 బంతుల్లో 31 పరుగులతో జట్టులో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఆ సమయంలో ఇతర భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నా, సుందర్‌ మాత్రం క్రీజులో నిలబడేందుకు ప్రయత్నిస్తూ విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

వివరాలు 

భారత తరఫున రెండో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్

గువాహటి టెస్ట్‌కు వచ్చేసరికి సాయి సుదర్శన్‌ జట్టులో చోటు దక్కించుకోవడంతో సుందర్‌ మూడో స్థానాన్ని వదులుకుని ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ,అతడు తొలి ఇన్నింగ్స్‌లో 92బంతులు ఆడి 48పరుగులు తీసి అర్ధశతకం అంచున నిలిచిపోయాడు. యశస్వి జైస్వాల్‌ తర్వాత ఆ ఇన్నింగ్స్‌లో భారత తరఫున రెండో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతర బ్యాటర్లు వరుసగా వెనుదిరిగిన వేళ,అతడు కుల్దీప్‌ యాదవ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు కృషి చేశాడు. ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కు 208బంతుల్లో 72పరుగులు జత చేశారు. గౌతమ్‌ గంభీర్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, వాషింగ్టన్‌ సుందర్‌ ఆడిన చివరి ఏడు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో 5,8,9,7,3,3,8 విధమైన విభిన్న బ్యాటింగ్‌ స్థానాల్లో ఆడాడు.

వివరాలు 

క్రికెట్‌ ఒక టీం గేమ్

ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్‌ స్థానంపై మాట్లాడిన సుందర్‌ ఇలా అన్నాడు: "జట్టుకు ఏం అవసరమైతే అది చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు పంపినా నేను సంతోషంగానే ఉంటాను. ఇది నాకే ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. క్రికెట్‌ ఒక టీం గేమ్, పరిస్థితుల ప్రకారం బ్యాట్‌-బాల్‌ రెండింటితోనూ సహకరించడానికి ప్రయత్నిస్తాను.జట్టుకు అవసరమైన ప్రతీ పాత్రను పోషించడానికి నేను రెడీ" అని చెప్పాడు. ప్రస్తుతం గువాహటి టెస్ట్‌లో టీమ్‌ఇండియా వెనుకబడిన స్థితిలో ఉంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో భారీగా 489 పరుగులు నమోదు చేయగా, భారత జట్టు మాత్రం 201 పరుగుల దగ్గర ఆలౌట్‌ అయింది.