Loading...
Wasim Akram: 3-0తో సిరీస్‌ ఓటమి.. సంబరాలు చేసుకోవడంపై వసీం అక్రమ్‌ ఆగ్రహం
3-0తో సిరీస్‌ ఓటమి.. సంబరాలు చేసుకోవడంపై వసీం అక్రమ్‌ ఆగ్రహం

Wasim Akram: 3-0తో సిరీస్‌ ఓటమి.. సంబరాలు చేసుకోవడంపై వసీం అక్రమ్‌ ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2026
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో అత్యంత ఘోరంగా కోల్పోయిన పాకిస్థాన్‌ జట్టుపై ఆ దేశ దిగ్గజ ఫాస్ట్‌ బౌలర్‌ వసీం అక్రమ్‌ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటమిని మరిచిపోయి అరంగేట్ర ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనకు సంబరాలు చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టాడు. ఇది 'సగటు ప్రదర్శనను అంగీకరించే మనస్తత్వాన్ని' సూచిస్తోందని ఘాటుగా విమర్శించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పాకిస్థాన్‌ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 103 పరుగుల తేడాతో, రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో, మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ ఓటమి పాలైంది.

వివరాలు

ఏడుగురు ప్లేయర్స్ తొలగింపు

తొలి రెండు మ్యాచ్‌ల అనంతరం జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లతో పాటు ఇద్దరు కోచ్‌లను జట్టు నుంచి తొలగించారు.

ఈపరిస్థితుల్లో చివరి టెస్టు కోసం 21 ఏళ్ల యువ ఫాస్ట్‌ బౌలర్‌ రజావుల్లాకు అవకాశం దక్కింది.

మార్దాన్‌కు చెందిన ఈ యువ ఆటగాడు తన అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్‌ వికెట్‌తో సహా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్‌లోనూ రజావుల్లా ఆకట్టుకున్నాడు. కేవలం 63బంతుల్లో 9సిక్సర్లతో 81 పరుగులు చేశాడు.

సిరీస్‌ ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన రజావుల్లాకు ఇస్లామాబాద్‌లో వేలాది మంది అభిమానులు, మీడియా ఘనస్వాగతం పలికారు. సోషల్‌ మీడియాలో అతడిని 'తదుపరి వకార్‌ యూనిస్‌' అంటూ పలువురు కొనియాడారు.

వివరాలు

కోచ్‌లను మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు

అయితే ఈ సంబరాల వాతావరణంపై వసీం అక్రమ్‌ తీవ్రంగా స్పందించాడు. వకార్‌ యూనిస్‌తో కలిసి ఓ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న అక్రమ్‌ మాట్లాడుతూ.. ''కనీసం ముఖం దాచుకుని వెళ్లాలి. మీ ఇంట్లో సంబరాలు చేసుకోండి.

మనం ఇంగ్లండ్‌ చేతిలో మాములుగా ఓడిపోలేదు.. చిత్తుగా ఓడిపోయాం. అలాంటిది ఇస్లామాబాద్‌లో 5,000 మంది అతనికి స్వాగతం పలికారు. ఇది మన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది.

మనం సగటు ప్రదర్శనను ఆస్వాదించడం అలవాటు చేసుకున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

కేవలం ఆటగాళ్లను, కోచ్‌లను మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదని వసీం అక్రమ్‌ స్పష్టం చేశాడు.

జట్టు వ్యవస్థలోనే కాకుండా ఆటగాళ్ల మనస్తత్వంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

ADVERTISEMENT