IND vs SA : ఆ ఒక్క తప్పిదం వల్లే ఓడిపోయాం : మార్‌క్రమ్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ప్రస్తుతం 1-2 తేడాతో వెనుకబడింది. ఈ పరాజయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ స్పందించాడు. భారత బౌలర్ల అసాధారణ ప్రదర్శన, వరుసగా వికెట్లు కోల్పోవడం, అనంతరం అభిషేక్ శర్మ చేసిన విధ్వంసమే తమ ఓటమికి కారణమని ఆయన తెలిపాడు. ఒకవేళ తమ జట్టు 150 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది.
Details
ఒంటరి పోరాటం చేసిన మార్‌క్రమ్
సౌతాఫ్రికా బ్యాటర్లలో మార్‌క్రమ్ (61; 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లలో డోనోవన్ ఫెరీరా (20), అన్రిచ్ నార్ట్జే (12) మాత్రమే రెండు అంకెల స్కోరు నమోదు చేశారు. రీజా హెండ్రిక్స్ డకౌట్‌గా వెనుదిరగగా, క్వింటన్ డికాక్ (1), డెవాల్డ్ బ్రెవిస్ (2), ట్రిస్టన్ స్టబ్స్ (9)లు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె చెరో వికెట్ తీశారు. అనంతరం 118 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా ఛేదించింది.
Details
2-1 ఆధిక్యంలోకి భారత్
భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (35; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. శుభ్‌మన్ గిల్ (28; 28 బంతుల్లో 5 ఫోర్లు), తిలక్ వర్మ (26 నాటౌట్; 34 బంతుల్లో 3 ఫోర్లు)లు కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ అనంతరం తన జట్టు ఓటమిపై మాట్లాడిన మార్‌క్రమ్, మ్యాచ్ ప్రారంభంలో పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొన్నాడు. టీమ్ఇండియా బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారిందన్నాడు. 'మేము వరుసగా నాలుగు, ఐదు, ఆరు వికెట్లు కోల్పోయాం. దీనికి భారత బౌలర్లకే పూర్తి క్రెడిట్ ఇవ్వాలి.
Details
150 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండేది
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలి, బౌలర్లపై ఒత్తిడి ఎలా తీసుకురావాలి అనే దానిపై మార్గాలు కనుగొనాలని మార్‌క్రమ్ వ్యాఖ్యానించాడు. టీమిండియా బౌలర్లు పరుగులు చేయడానికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదని ఆయన అన్నాడు. తాను చివరి వరకు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. ఒకవేళ తమ జట్టు 140 లేదా 150 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా సాగేదని అభిప్రాయపడ్డాడు. అలాగే టీమ్ఇండియా స్పష్టమైన ప్రణాళికలతో ఆడుతోందని, ముఖ్యంగా అభిషేక్ శర్మ తన దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తమ చేతుల నుంచి వేగంగా లాగేసుకున్నాడని చెప్పాడు.
Details
ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం
'అభిషేక్ విధ్వంసంతో భారత్ పవర్‌ప్లేలోనే 60 పరుగులు చేసింది. ఆ తర్వాత మేము కొంత పుంజుకున్నాం. మా బౌలర్లు సరైన ప్రాంతాల్లో బంతులు వేశారు. మ్యాచ్‌ను సాధ్యమైనంత వరకు చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాం. ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని మార్‌క్రమ్ స్పష్టం చేశాడు.