LOADING...
Team India: గెలిచాం కానీ.. బుమ్రా లేకపోతే ఏమయ్యేదో!
గెలిచాం కానీ.. బుమ్రా లేకపోతే ఏమయ్యేదో!

Team India: గెలిచాం కానీ.. బుమ్రా లేకపోతే ఏమయ్యేదో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాచ్‌ గెలిచాం.. ఫైనల్‌కు చేరాం.. ఆనందం ఉందే కానీ గెలిచిన తీరు మాత్రం పూర్తిగా సంతృప్తి కలిగించలేదు. 254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించి, ఇంగ్లాండ్‌ను వందలోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయేలా చేసినా.. చివరికి టీమిండియా గెలుపు కూడా అంత ఈజీగా రాలేదు. మొదట్లో అసాధ్యంగా కనిపించిన ఈ లక్ష్య ఛేదన, ఒక దశలో ఇంగ్లాండ్‌కు సులభమవుతుందేమో అన్న భావనను కలిగించింది. బుమ్రా 18వ ఓవర్‌ వేయడానికి ముందువరకు భారత్‌ విజయం ఖాయం అనే ధీమా కనిపించలేదు. పైగా ఓటమి భయం ఎక్కువగా కనిపించింది. ఈ మ్యాచ్‌తో భారత బౌలింగ్‌లో ఉన్న బలహీనతలు బట్టబయలయ్యాయి. బుమ్రాను తప్పిస్తే.. నమ్మదగ్గ మరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి స్పష్టంగా కనిపించింది.

Details

వరుసగా మూడు సిక్సర్లు బాదిన బెతెల్

ఎవరికి ఓవర్‌ ఇవ్వాలి.. ఇచ్చిన తర్వాత ఏమవుతుందో అన్న అనిశ్చితి జట్టును వెంటాడింది. ప్రపంచకప్‌కు ముందు వరకు ప్రత్యర్థి బ్యాటర్లకు మిస్టరీగా కనిపించిన వరుణ్‌ చక్రవర్తి ఈ టోర్నీలో పూర్తిగా తేలిపోయాడు. సెమీఫైనల్‌లో అయితే అతడి ప్రదర్శన మరింత నిరాశ కలిగించింది. నాలుగు ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించాడు. పేలవ ఫామ్‌లో ఉన్న బట్లర్‌ను బౌల్డ్‌ చేయడం మినహా అతడి బౌలింగ్‌లో ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. వరుణ్‌ బంతి అందుకున్న వెంటనే.. అప్పుడే క్రీజులోకి వచ్చిన బెతెల్‌ వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. ఆ ఊపులో తర్వాత ఇతర బౌలర్లను కూడా ధాటిగా ఎదుర్కొన్నాడు. అక్షర్‌ పటేల్‌ కూడా ఈ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు.

Details

పదేపదే వైడ్ లు వేసిన అర్ష్‌దీప్‌ సింగ్

అర్ష్‌దీప్‌ సింగ్‌ కొన్నిసార్లు అద్భుతమైన బంతులు వేసినా.. చాలా సందర్భాల్లో అదుపు తప్పాడు. పదేపదే వైడ్‌లు వేయడం, బ్యాటర్లకు షాట్లు ఆడే అవకాశాలు ఇవ్వడంతో భారత్‌కు టెన్షన్‌ తప్పలేదు. చివరికి బుమ్రానే జట్టును గట్టెక్కించాడు. చివరి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. లేదంటే అంత పెద్ద స్కోరు చేసినా ఓటమి తప్పేదే కాదు. బుమ్రా తప్ప మరో నమ్మదగ్గ బౌలర్‌ లేకపోవడం భారత జట్టు బలహీనతను మరోసారి స్పష్టం చేసింది. ఫైనల్లో భారత్‌ ఎదుర్కొనబోయే న్యూజిలాండ్‌ జట్టులో ఫిన్‌ అలెన్‌, టిమ్‌ సీఫర్ట్‌ వంటి విధ్వంసక ఓపెనర్లు ఉన్నారు. వీరిని ఈ బౌలింగ్‌ దళం ఎంతవరకు అడ్డుకోగలదన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Details

64 పరుగులు

వరుణ్‌ చక్రవర్తి వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ను తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. బుమ్రా తప్ప మిగతా బౌలర్లు తమ బంతుల్లో పదును పెంచకపోతే.. కప్పు గెలుపు ఆశలు కష్టమే. ఈ మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి ఇచ్చిన పరుగులు. టీ20 ప్రపంచకప్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన భారత బౌలర్‌గా అతడు నిలిచాడు. ఇప్పటివరకు జోగిందర్‌ శర్మ ఇచ్చిన 57 పరుగుల రికార్డును అతడు అధిగమించాడు.

Advertisement