Loading...
Rinku Singh Wedding: మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లకు పెళ్లి ఆహ్వానం.. రింకూ సింగ్‌ వివాహ వేడుక ఎక్కడంటే?
మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లకు పెళ్లి ఆహ్వానం.. రింకూ సింగ్‌ వివాహ వేడుక ఎక్కడంటే?

Rinku Singh Wedding: మోదీ, యోగి ఆదిత్యనాథ్‌లకు పెళ్లి ఆహ్వానం.. రింకూ సింగ్‌ వివాహ వేడుక ఎక్కడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెటర్‌ రింకూ సింగ్‌ తన వివాహానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని వద్దకు వెళ్లిన రింకూ.. తన పెళ్లి ఆహ్వాన పత్రికను అందించి ఆశీస్సులు తీసుకున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడి వివాహం డిసెంబర్‌ 4న లక్నోలో జరగనుంది. మోదీని కలిసిన ఫొటోలు షేర్‌ చేసిన రింకూ ప్రధానితో భేటీకి సంబంధించిన ఫొటోలను రింకూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలవడం, తన వివాహానికి ఆహ్వానించి ఆయన ఆశీస్సులు తీసుకోవడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని పేర్కొన్నాడు.

వివరాలు

యోగి ఆదిత్యనాథ్‌కు కూడా పెళ్లి పత్రిక

రింకూ వివాహ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అతడి కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి పెళ్లి పత్రిక అందించారు.

రింకూ తల్లి బీనా దేవి, సోదరుడు సోనూ సింగ్‌, సోదరి నేహా సింగ్‌ లక్నోలోని సీఎం నివాసానికి వెళ్లి వివాహానికి ఆహ్వానించారు.

లక్నోలోని రమదా హోటల్‌లో రింకూ, ప్రియా వివాహ వేడుక జరగనుంది. క్రికెట్‌, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.

గతేడాది జూన్‌ 8న లక్నోలోని 'ది సెంట్రమ్‌' హోటల్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది.

వివరాలు

ఫ్యాన్‌ పేజీలో ప్రియా ఫొటో చూసి..

తమ ప్రేమకథ గురించి రింకూ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కరోనా సమయంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల కోసం ముంబైలో ఉన్నప్పుడు ఓ ఫ్యాన్‌ పేజీలో ప్రియా ఫొటో చూశానని చెప్పాడు.

ఆమె తన ఫొటోలకు లైక్‌లు ఇవ్వడంతో సందేశం పంపేందుకు ధైర్యం వచ్చిందని వివరించాడు. అలా మొదలైన పరిచయం క్రమంగా మాటలుగా మారి ప్రేమకు దారితీసిందన్నాడు.

రింకూ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు ప్రియా స్టేడియాలకు వచ్చి అతడిని ప్రోత్సహిస్తుంటారు.

ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున రింకూ ఆడిన సమయంలోనూ ఆమె ప్రేక్షకుల మధ్య కనిపించారు.

జింబాబ్వే పర్యటనలో భారత్‌ తరఫున చివరిసారిగా ఆడిన రింకూ.. త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు.

ADVERTISEMENT