Team India: ఇదేమి వ్యూహం? కీలక మ్యాచ్‌లో టీమిండియా సెలక్షన్‌పై విమర్శల వర్షం!
ఈ వార్తాకథనం ఏంటి
గెలుపులు వరుసగా వస్తున్నప్పుడు జట్టులోని లోపాలు బయటపడవు. కానీ కఠిన పరీక్ష ఎదురైనప్పుడే అసలు బలం, బలహీనతలు స్పష్టమవుతాయి. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో టీమిండియాకు ఎదురైన తాజా ఘోర పరాభవం జట్టు సామర్థ్యంపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ఓడిపోవడం సహజమే అయినా పోటీ లేకుండా తలవంచిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. జట్టు ఎంపిక నుంచి తుది కూర్పు, వ్యూహాల వరకూ ప్రతి అంశం చర్చకు దారితీసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా, టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్‌లో మంచి ఆరంభం దక్కినా దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. బ్యాటింగ్‌లో ప్రత్యర్థి వ్యూహాలకు సులభంగా లొంగిపోయింది.
Details
'మాస్టర్ స్ట్రోక్' అనుకున్న నిర్ణయం బూమరాంగ్?
జట్టు కూర్పు విషయంలో తీసుకున్న నిర్ణయాలే ప్రధాన చర్చగా మారాయి. మ్యాచ్‌కు ముందు ప్రకటించిన తుది జట్టే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్షర్ పటేల్‌కు గాయం ఏదైనా ఉందేమో అనుకున్న అభిమానులు, అతను ఫిట్‌గా ఉన్నప్పటికీ పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడం చూసి షాక్‌కు గురయ్యారు. గ్రూప్ దశలో అక్షర్ మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. పాకిస్థాన్‌తో కీలక పోరులోనూ రెండు ముఖ్యమైన వికెట్లు పడగొట్టి పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక సుందర్ విషయానికి వస్తే, అతను గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అది నెదర్లాండ్స్‌పై. ఆ మ్యాచ్‌లో వికెట్ లేకుండా 36పరుగులిచ్చాడు. అక్షర్ బ్యాటింగ్‌లోనూ వెనుకబడడు. ఎడమచేతి బౌలర్‌గా వైవిధ్యం కూడా అందించగలడు.
Details
అక్షర్ ను పక్కనపెట్టడంపై విమర్శలు
అయినప్పటికీ అతన్ని పక్కన పెట్టి సుందర్‌ను తీసుకోవడం వెనుక ఉద్దేశం ఏమిటన్నది అర్థంకాని ప్రశ్నగా మిగిలింది. దక్షిణాఫ్రికాకు వ్యూహాత్మకంగా షాక్ ఇవ్వాలనుకున్న నిర్ణయం చివరకు భారత్‌కే బూమరాంగ్ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సుందర్‌ను ఎంపిక చేసినా అతడిని పూర్తి స్థాయిలో ఉపయోగించలేదు. కేవలం రెండు ఓవర్లకే పరిమితం చేశారు. గతేడాది కాలంలో కూడా సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుని, బౌలింగ్‌లో పూర్తిగా వినియోగించని సందర్భాలు చాలానే ఉన్నాయి. బహుశా అతని బౌలింగ్ ప్రభావవంతంగా లేకపోవడమే కారణమేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అక్షర్ చివరి ఏడు టీ20ల్లో 14 సగటుతో 13 వికెట్లు తీయడం గమనార్హం. అతను ఆడితే బౌలింగ్ మరింత ప్రభావవంతంగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Details
రింకు, కుల్‌దీప్ అంశాలపై తీవ్ర చర్చ
కొంతకాలం పక్కనపెట్టిన రింకు సింగ్‌ను అకస్మాత్తుగా ప్రపంచకప్ జట్టులోకి తీసుకుని తుది జట్టులో ఆడించడం కూడా విమర్శలకు గురైంది. శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ లాంటి నాణ్యమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ రింకుకే ప్రాధాన్యం ఎందుకన్న ప్రశ్నలు లేవుతున్నాయి. అమెరికా, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతను నిలబడలేకపోయాడు. నమీబియాపై ఆరు బంతుల్లో ఒక్క పరుగే చేసి ఔటయ్యాడు. ఇక టీ20ల్లో ప్రతిసారీ మెరుగైన ప్రదర్శన ఇస్తున్న కుల్‌దీప్ యాదవ్‌ను తుది జట్టుకు దూరంగా ఉంచడం మరో పెద్ద చర్చగా మారింది. ఆసియా కప్ నుంచి అతను 14 టీ20ల్లో 12.88 సగటుతో 26 వికెట్లు తీశాడు.
Details
మార్పులు తప్పవా?
పాకిస్థాన్‌పై 3 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నా, తర్వాత అవకాశమే రాలేదు.అక్షర్ స్థానంలో కనీసం కుల్‌దీప్‌ను తీసుకోవాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్, కోచ్ ఆలోచనలపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గ్రూప్ దశలో తడబడినా పుంజుకున్న భారత్, ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడింది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిన వేళ జట్టు యాజమాన్యం ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి లేదు. సహాయ కోచ్ టెన్ డస్కాటే మాట్లాడుతూ, "కొంచెం భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటే అలా చేస్తాం. గత 18 నెలల్లో అద్భుతంగా ఆడిన జట్టుకే మేం కట్టుబడి ఉన్నాం. సంజు శాంసన్‌ను తీసుకుంటే వ్యూహాత్మకంగా బాగుంటుందేమో. టాప్ ఆర్డర్లో కుడిచేతి బ్యాటర్ అవసరం ఉంటుంది.
Details
కుల్దీప్ కి అవకాశం కల్పించే అవకాశం
రింకు స్థానం 7-8లో కఠినమే. అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. సమస్యలన్నీ పరిష్కరించుకుని జింబాబ్వేతో మ్యాచ్‌లో బలంగా పుంజుకుంటామని తెలిపారు. జింబాబ్వేతో మ్యాచ్ చెపాక్ మైదానంలో జరగనుంది. అక్కడ స్పిన్నర్లకు అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రింకు లేదా అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్‌దీప్‌కు అవకాశం కల్పించే అవకాశం కనిపిస్తోంది. అభిషేక్ శర్మ టోర్నీలో వరుసగా విఫలమవుతుండటంతో అతనిపై వేటు వేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. తిలక్ వర్మ కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వీరిలో ఒకరిని తప్పించి సంజు శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం.