Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రత్యేకత ఏమిటి? మినీ వరల్డ్ కప్‌గా మారడానికి కారణమిదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో వన్డే వరల్డ్ కప్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి కొత్త టోర్నీలొచ్చాయి.
అయినా ఛాంపియన్స్ ట్రోఫీకి ఉన్న ప్రత్యేకత ఏ మాత్రం తగ్గలేదు.
ప్రపంచంలోని టాప్-8 జట్ల మధ్య జరిగే ఈ పోటీ విశేషమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.
Details
క్రికెట్ అభివృద్ధికి నాంది
ప్రారంభంలో ప్రపంచకప్‌లో ఐసీసీ ఫుల్ మెంబర్ దేశాలకే అవకాశం ఉండేది. టెస్టు హోదా లేని దేశాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం నిధులు సేకరించాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఐసీసీ 1998లో వన్డే ఫార్మాట్‌లో నాకౌట్ ట్రోఫీని ప్రవేశపెట్టింది.
తొలిసారి ఈ టోర్నీ బంగ్లాదేశ్‌లో, ఆపై కెన్యాలో నిర్వహించారు.
రెండేళ్లకోసారి జరిపే ఈ టోర్నీని 2002లో "ఛాంపియన్స్ ట్రోఫీ"గా మార్చారు. అదే సమయంలో పోటీ జట్ల సంఖ్యను 12కి పెంచారు.
Details
మినీ వరల్డ్ కప్‌గా మారిన ఛాంపియన్స్ ట్రోఫీ
2004లో 12 జట్లతో, 2006లో 10 జట్లతో ఈ టోర్నీ నిర్వహించారు. అయితే 2009 నుంచి ఇది టాప్-8 జట్ల మధ్య మాత్రమే జరుగుతూ వచ్చింది.
దీంతో ఇది మినీ వరల్డ్ కప్‌గా పేరు తెచ్చుకుంది. వన్డే ప్రపంచకప్ విలువ తగ్గకుండా ఉండేలా ఛాంపియన్స్ ట్రోఫీని తక్కువ రోజుల పాటు, తక్కువ మ్యాచ్‌లతో నిర్వహించడం ప్రారంభించారు.
టోర్నీ ప్రారంభానికి 6 నెలల ముందు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉండే జట్లకే ఇందులో ఆడే అర్హత లభిస్తుంది.
Details
రెండేళ్లకోసారి నుంచి నాలుగేళ్లకోసారి
మొదట ఛాంపియన్స్ ట్రోఫీని రెండేళ్లకోసారి నిర్వహించేవారు. కానీ 2008లో భద్రతా కారణాలతో పాకిస్థాన్‌లో జరగాల్సిన టోర్నీ రద్దయింది.
ఆ టోర్నీని 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. అప్పటి నుంచి ఈ టోర్నీ నాలుగేళ్లకోసారి జరిపేలా మార్పు చేశారు.
2017 తర్వాత వన్డే వరల్డ్ కప్ ప్రాధాన్యం తగ్గకుండా ఉండేలా ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేశారు. కానీ 2021లో ఐసీసీ మళ్లీ ఈ టోర్నీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది.
దీంతో ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభంకానుంది.
Details
టోర్నమెంట్ ఫార్మాట్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫార్మాట్‌ను రెండున్నర వారాల్లో ముగిసేలా రూపొందించారు. టోర్నీకి అర్హత సాధించిన 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
ఒక్కో జట్టు గ్రూప్ స్టేజ్‌లో మిగతా మూడు జట్లతో రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్‌లో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు వెళ్లతాయి.
సెమీఫైనల్ విజేతలు ఫైనల్‌లో తలపడతారు. ఈ విధంగా ఓ జట్టు గరిష్ఠంగా 5 మ్యాచ్‌లు (గ్రూప్ స్టేజ్‌లో 3, సెమీస్, ఫైనల్) ఆడే అవకాశం ఉంటుంది. మొత్తంగా 15 మ్యాచ్‌ల్లో ఈ టోర్నీ పూర్తవుతుంది.