LOADING...
Baldev Singh: నాలుగు దశాబ్దాల సేవలకు గుర్తింపు.. హాకీ కోచ్ బల్దేవ్ సింగ్‌కు పద్మశ్రీ
నాలుగు దశాబ్దాల సేవలకు గుర్తింపు.. హాకీ కోచ్ బల్దేవ్ సింగ్‌కు పద్మశ్రీ

Baldev Singh: నాలుగు దశాబ్దాల సేవలకు గుర్తింపు.. హాకీ కోచ్ బల్దేవ్ సింగ్‌కు పద్మశ్రీ

వ్రాసిన వారు Moogati Shabari
May 21, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత హాకీకి విశేష సేవలు అందించిన ప్రముఖ కోచ్ బల్దేవ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు వరించింది. మే 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. భారత హాకీ అభివృద్ధికి ఆయన చేసిన అపార కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. హర్యానాలోని చిన్న పట్టణం షాహాబాద్ మార్కండాను దేశంలోనే ప్రముఖ హాకీ ప్రతిభా కేంద్రంగా తీర్చిదిద్దిన వ్యక్తిగా బల్దేవ్ సింగ్ పేరు నిలిచింది. ఆయన కృషితో అక్కడి నుంచి ఎన్నో మంది అంతర్జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు.

వివరాలు

భారత హాకీలో కీలక బాధ్యతలు..

బల్దేవ్ సింగ్ 1982లో హర్యానా స్పోర్ట్స్ డిపార్ట్‌మెంట్‌లో కోచ్‌గా షాహాబాద్ మార్కండాకు వచ్చారు. అనంతరం 1993లో తిరిగి అక్కడికి చేరుకుని దేశంలో అత్యంత విజయవంతమైన హాకీ అకాడమీలలో ఒకటిని స్థాపించారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 80 మందికిపైగా అంతర్జాతీయ క్రీడాకారులు, ఎనిమిది మంది భారత జట్టు కెప్టెన్లు తయారయ్యారు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన యువ ప్రతిభను వెలికితీసి తీర్చిదిద్దడంలో అసాధారణ కృషి చేశారు. కోచ్‌గా మారే ముందు బల్దేవ్ సింగ్ నామ్‌ధారి హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో కోచింగ్ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత భారత హాకీలో కీలక బాధ్యతలు చేపట్టారు.

వివరాలు

యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర..

1993లో భారత జూనియర్ పురుషుల జట్టుకు చీఫ్ కోచ్, సెలెక్టర్‌గా పనిచేశారు. 1996లో చెన్నైలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. 2001 నుంచి 2004 వరకు భారత పురుషుల హాకీ జట్టు ప్రధాన కోచ్‌గా సేవలందించారు. నెదర్లాండ్స్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ వంటి అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో కూడా ఆయన భారత జట్టుకు కోచింగ్ అందించారు. నాలుగు దశాబ్దాలకు పైగా భారత హాకీ అభివృద్ధికి నిశ్శబ్దంగా సేవలందిస్తున్న బల్దేవ్ సింగ్, కోచింగ్‌తో పాటు యూనివర్సిటీలు, క్రీడా సంస్థలతో కలిసి యువ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

వివరాలు

ఒలింపిక్ టాస్క్ ఫోర్స్‌‌కు సేవ..

అలాగే టోక్యో, పారిస్, లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం దీర్ఘకాల ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వ ఒలింపిక్ టాస్క్ ఫోర్స్‌లో కూడా సభ్యుడిగా పనిచేశారు. ఇక ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఐదు పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'పీపుల్స్ పద్మ' #PeoplesPadma పేరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు లేని ప్రతిభావంతులు, గ్రామీణ స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వారిని వెలుగులోకి తీసుకొస్తోంది. జాతి, వృత్తి, హోదా, లింగ భేదాలు లేకుండా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ అవార్డుల ద్వారా సత్కరిస్తున్నారు.

Advertisement