Jeffrey Vandersay: టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను చిత్తు చేసిన శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే ఎవరు?
భారత క్రికెట్ జట్టు, శ్రీలంక క్రికెట్ జట్టు మధ్య కొలంబో వేదికగా ఆగస్టు 4న జరిగిన వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని ఊహించిన అందరి అంచనాలను శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే తలకిందులు చేశాడు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 13 ఓవర్‌లో రోహిత్ శర్మను ఔట్ చేసి వికెట్ల వేటను మొదలు పెట్టిన వాండర్సే.. ఆ తర్వాత విరాట్ కోహ్లి, శివమ్ దూబేలను వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు. జెఫ్రీ ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 6 కీలక వికెట్లను పడగొట్టి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
మ్యాచ్‌లో వాండర్సే ప్రదర్శన ఎలా ఉంది?
ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన వాండర్సే.. గురించి ఇప్పుడు నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (64), శుభ్‌మన్ గిల్ (35) 80 బంతుల్లో 97 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్‌ను ఔట్ చేయడం ద్వారా వాండర్సే ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. గిల్, శివమ్ దూబే (0), విరాట్ కోహ్లీ (14), శ్రేయాస్ అయ్యర్ (7), కేఎల్ రాహుల్ (0)లకు కూడా పెవిలియన్ బాట పట్టించాడు. వాండర్సే 10 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు సాధించాడు.
వాండర్సే కంటే ముందు ఈ ఫీట్ సాధించింది ఎవరంటే..
భారత్‌పై వన్డే క్రికెట్‌లో 5 వికెట్లు తీసిన రెండో మణికట్టు స్పిన్నర్‌గా వాండర్సే నిలిచాడు. అతని కంటే ముందు, ఈ ఫీట్ ను పాకిస్థాన్ క్రికెట్ జట్టు వెటరన్ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ (5/36, 1996) సాధించాడు. అదేవిధంగా భారత్‌తో జరిగిన వన్డేలో మూడో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో అత్యుత్తమ స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (7/30, 2000) మొదటి స్థానంలో, అజంతా మెండిస్ (6/13, 2008) రెండో స్థానంలో ఉన్నారు.
హసరంగ స్థానంలో వాండర్సేకు జట్టులో అవకాశం
భారత్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు తొలుత ప్రకటించిన శ్రీలంక జట్టులో వాండర్సేకు చోటు దక్కలేదు. అయితే రెండో వన్డేకు ముందు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం బారిన పడడంతో అనుహ్యంగా వాండర్సే లంక జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన ODI కెరీర్‌లో మొదటిసారి 5 వికెట్లు తీసి జట్టును విజయపథంలో నడిపించాడు.
వాండర్సే ఎవరు?
శ్రీలంకలోని వత్తాలాలో జన్మించిన 34 ఏళ్ల వాండర్సే దేశవాళీ క్రికెట్‌లో జాఫ్నా తరఫున ఆడుతున్నాడు. అతను రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్. దేశవాళీ క్రికెట్‌లో తన బలమైన ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అందుకే 2015లోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. అతను జూలై 2015లో పాకిస్తాన్‌పై తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. డిసెంబర్ 2015లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై ODI అరంగేట్రం చేశాడు.
టెస్టు అరంగేట్రం కోసం 7 ఏళ్ల పాటు ఎదురుచూపులు
T20, ODI అరంగేట్రం తర్వాత తన టెస్ట్ అరంగేట్రం కోసం వాండర్సే 7 సంవత్సరాల సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వచ్చింది. అతను 2022లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో తన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టెస్టు జట్టులో అవకాశం రాలేదు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వాండర్సే ప్రదర్శన ఎలా ఉంది?
వాండర్సే ఇప్పటివరకు 22 ODI మ్యాచ్‌లలో 21 ఇన్నింగ్స్‌లలో 26.52 సగటుతో, 5.47 ఎకానమీ రేటుతో 33 వికెట్లు తీశాడు. అదేవిధంగా, 14 T-20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, అతను 56.42 సగటుతో, 8 ఎకానమీతో 7 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 2/26. ఇది కాకుండా, అతను ఏకైక టెస్టులో తన పేరిట కేవలం 2 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో వాండర్సే ప్రదర్శన ఎలా ఉంది?
దేశవాళీ క్రికెట్‌లో వాండర్సే ఆటతీరు ఆకట్టుకుంది. అతను 73 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 28.19 సగటుతో, 3.97 ఎకానమీతో 270 వికెట్లు తీశాడు. అతను 17 సార్లు 5 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 7/77. అదేవిధంగా, అతను 102 లిస్ట్-ఎ క్రికెట్ మ్యాచ్‌లలో 23.76 సగటుతో 150 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 6/33. 95 టీ20 మ్యాచ్‌లు ఆడి 94 వికెట్లు తీయడంలో సఫలమయ్యాడు.