LOADING...
Vaibhav Suryavanshi: ఐపీఎల్‌ 2025తో వెలుగులోకి వచ్చిన టీనేజ్‌ తుపాన్‌.. వైభవ్‌ బ్యాటింగ్‌ విధ్వంసం 
వైభవ్‌ బ్యాటింగ్‌ విధ్వంసం

Vaibhav Suryavanshi: ఐపీఎల్‌ 2025తో వెలుగులోకి వచ్చిన టీనేజ్‌ తుపాన్‌.. వైభవ్‌ బ్యాటింగ్‌ విధ్వంసం 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఐపీఎల్‌ 2025కు ముందు వరకు ఈ టీనేజ్‌ క్రికెటర్‌ గురించి తెలిసినవారు చాలా తక్కువమందే. కానీ ఐపీఎల్‌ ముగిసే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సంచలన బ్యాటింగ్‌, మెరుపు ఇన్నింగ్స్‌లు, ఊహించని రికార్డులతో ఈ 14 ఏళ్ల బ్యాటర్‌ ఒక్కసారిగా 'క్రికెట్‌ ప్రపంచం దృష్టిని' ఆకర్షించాడు. ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 14 ఏళ్లు 23 రోజుల వయసులో అరంగేట్రం చేసిన అతి పిన్న ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ను గతేడాది జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు కొనుగోలు చేశారు.

వివరాలు 

'సిక్స్‌'తోనే ఐపీఎల్‌ ఆరంభం 

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్‌.. లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. తుది జట్టులో లేకపోయినా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌కు పంపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో 20 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు సాధించాడు. మూడో మ్యాచ్‌లోనే మెరుపు సెంచరీ 28 ఏప్రిల్‌ 2025న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ వైభవ్‌కు కేవలం మూడో ఐపీఎల్‌ మ్యాచ్‌ మాత్రమే. కానీ అదే మ్యాచ్‌లో అతడు టీ20 క్రికెట్‌లో మెరుపు శతకం బాది అందరి నోళ్లు తెరిపించాడు.

వివరాలు 

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌, అండర్‌-19లో.. 

కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి తన సత్తా చాటాడు.మొత్తం మీద 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభ ఐపీఎల్‌కే పరిమితం కాలేదు. ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో ఇండియా-ఎ జట్టు తరఫున యూఏఈపై కేవలం 32 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 42 బంతుల్లో 144 పరుగులు సాధించాడు.అందులో 11 ఫోర్లు,15 సిక్స్‌లు ఉండటం విశేషం. అలాగే వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ అండర్‌-19 టోర్నీలోనూ యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో అతడు భారీ శతకంతో చెలరేగాడు. 95 బంతుల్లో 171 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు.ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు,14 సిక్స్‌లు ఉన్నాయి.

Advertisement

వివరాలు 

'సయ్యద్‌ ముస్తాక్‌ అలీ'లో.. 

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలోనూ వైభవ్‌ సూర్యవంశీ కొత్త చరిత్ర లిఖించాడు. 14 ఏళ్లు 250 రోజుల వయసులో సెంచరీ చేసిన అతి పిన్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బిహార్‌ తరఫున బరిలోకి దిగిన అతడు 61 బంతుల్లో 108 పరుగులు (7 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా 15 ఏళ్లు నిండకముందే టీ20ల్లో మూడు సెంచరీలు సాధించడం అతడి ఖాతాలో మరో అరుదైన ఘనత. ఈ మూడు శతకాలు ఐపీఎల్‌ 2025, ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2025, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో నమోదయ్యాయి.

Advertisement

వివరాలు 

తాజాగా 'విజయ్‌ హజారే'లో.. 

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా రాంచీలో జరిగిన మ్యాచ్‌లో బిహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనూ వైభవ్‌ సూర్యవంశీ అసాధారణ ప్రదర్శన చేశాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 84 బంతుల్లో 190 పరుగులు చేసి డబుల్‌ సెంచరీకి అతి దగ్గరగా వచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 15 సిక్స్‌లు ఉన్నాయి. క్రీజులో ఉన్నంతసేపూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ ఫోర్లు, సిక్స్‌లతో మోత మోగించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన బిహార్‌ 574 పరుగులు సాధించడంలో వైభవ్‌ కీలక పాత్ర పోషించాడు.

వివరాలు 

తాజాగా 'విజయ్‌ హజారే'లో.. 

ఇలా 2025 సంవత్సరం క్రికెట్‌ ప్రపంచానికి వైభవ్‌ సూర్యవంశీ అనే కొత్త తుఫాన్‌ను పరిచయం చేసింది. భవిష్యత్తులో టీమిండియాకు కీలక ఆటగాడిగా మారే సత్తా అతడిలో స్పష్టంగా కనిపిస్తోంది. భారత సీనియర్‌ జట్టులో వీలైనంత త్వరగా అతడికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ రోజు త్వరలోనే రావాలని టీమ్‌ఇండియా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Advertisement