LOADING...
Yuvraj Singh Samra: యువీ గడ్డపై మెరిసిన మరో యువరాజ్‌.. కెనడా కుర్రాడి సంచలన సెంచరీ
యువీ గడ్డపై మెరిసిన మరో యువరాజ్‌.. కెనడా కుర్రాడి సంచలన సెంచరీ

Yuvraj Singh Samra: యువీ గడ్డపై మెరిసిన మరో యువరాజ్‌.. కెనడా కుర్రాడి సంచలన సెంచరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌కు అనుకూల వాతావరణమే లేని దేశంలో పుట్టి పెరిగాడు అతడు. ఏడాదిలో కేవలం మూడు నెలలే ఆటకు అవకాశం ఉండే పరిస్థితుల్లో, క్రికెట్‌లో రాణించి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే ఒక విశేషం. అలాంటిది ప్రపంచకప్‌ వేదికపై ఆడే అవకాశం రావడం అతడి కలలకందని ఘనత. తన ఆరాధ్య ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ పుట్టిన నేలపై జరుగుతున్న ఈ టోర్నీలో ఎప్పుడెప్పుడు బ్యాట్‌ పట్టే అవకాశం వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూశాడు. ఒక్క మంచి ఇన్నింగ్స్‌ పడితే జీవితమే మలుపు తిరుగుతుందని నమ్మాడు. చివరకు ఆ క్షణం వచ్చింది. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో లభించిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని మెరుపు శతకంతో సంచలనం సృష్టించాడు.

వివరాలు 

యువరాజ్‌ సమ్రాకు క్రికెట్‌పై ఆసక్తి కలిగించడంలో తండ్రి కీలక పాత్ర

వార్తల్లో నిలిచిన ఆ కుర్రాడే 19 ఏళ్ల యువరాజ్‌ సింగ్‌ సమ్రా. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్‌ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. భారత మాజీ స్టార్‌ యువరాజ్‌ను తలపించే స్టాన్స్‌, అదే తరహా స్వింగ్‌,ఎడమచేతి వాటం బ్యాటింగ్‌, యువీ ఆటను గుర్తు చేసే షాట్లతో ఈ కెనడా యువకుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. కెనడాలోనే జన్మించి అక్కడే పెరిగిన యువరాజ్‌ సమ్రాకు క్రికెట్‌పై ఆసక్తి కలిగించడంలో అతడి తండ్రి బల్జీత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించాడు. తన అభిమాన ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ పేరునే కుమారుడికి పెట్టిన బల్జీత్‌, చిన్ననాటి నుంచే అతడిని క్రికెట్‌ వైపు నడిపించాడు. స్థానికంగా జరిగే ప్రతి మ్యాచ్‌కూ కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లడంతో యువరాజ్‌కు ఆటపై మక్కువ పెరిగింది.

వివరాలు 

ఆరంభం నుంచే దూకుడైన బ్యాటర్‌గా పేరు

టొరంటో జిల్లా క్రికెట్‌ సంఘం తరఫున అతడి ప్రయాణం మొదలైంది. ఆరంభం నుంచే దూకుడైన బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది బహమాస్‌పై కెనడా జట్టులోకి అంతర్జాతీయ అరంగేట్రం చేసి,కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ అదే స్థాయిలో మెరిసే ఇన్నింగ్స్‌ ఆడి తన సత్తా చాటాడు. ఇప్పటివరకు యువరాజ్‌ ఎనిమిది వన్డేల్లో ఒక శతకంతో కలిపి 172పరుగులు సాధించగా,18 టీ20ల్లో ఒక సెంచరీ,మూడు అర్ధసెంచరీలతో మొత్తం 459పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అతడు భావిస్తున్నాడు.తండ్రి ప్రోత్సాహమే తన క్రికెట్‌ ప్రయాణానికి బలం అని చెబుతున్నాడు. చిన్ననాటి నుంచీ తనకు ఇష్టమైన ఆటగాడు యువరాజ్‌ సింగ్‌నే ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నానని చెప్పాడు.

Advertisement

వివరాలు 

మూడు నెలలే క్రికెట్‌ ఆడే వీలు

ఇకపై క్రికెట్‌ తన జీవనోపాధిగా మారుతుందన్న నమ్మకం వ్యక్తం చేశాడు. కెనడా నుంచి వచ్చి ప్రపంచ వేదికపై ఇలాంటి ప్రదర్శన చేయడం ఒక కలలా ఉందన్నాడు. ఈ ఒక్క అవకాశం కోసమే చాలా రోజులుగా ఎదురు చూసినట్లు తెలిపాడు. దాదాపు ఏడాది పొడవునా మైనస్‌ 25 డిగ్రీల చలితో ఉండే కెనడాలో కేవలం మూడు నెలలే క్రికెట్‌ ఆడే వీలు ఉంటుందని, ఆ సమయంలోనే సాధనతో పాటు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుందని వివరించాడు. మేనేజ్‌మెంట్‌ సహకారంతోనే కెనడా ప్రపంచకప్‌కు అర్హత సాధించగలిగిందని, తాను వెలుగులోకి రావడానికి అదే కారణమని యువరాజ్‌ చెప్పాడు.

Advertisement

వివరాలు 

యువరాజ్‌ సమ్రా సరికొత్త రికార్డు

టీ20 ప్రపంచకప్‌లో శతకం చేసిన అతి పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల వయసులో) యువరాజ్‌ సమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2014లో 22 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన పాకిస్థాన్‌ ఆటగాడు షెజాద్‌ రికార్డును అతడు బద్దలు కొట్టాడు.

Advertisement