IND Vs NZ: ఎందుకిలా మారింది భారత్?.. హోం సిరీస్‌లలో వరుస ఎదురుదెబ్బలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు సొంతగడ్డపై టీమిండియా తిరుగులేని శక్తిగా నిలిచేది. స్వదేశంలో జరిగే సిరీస్‌లను అలవోకగా చేజిక్కించుకునే భారత జట్టు, ఇప్పుడు అదే వేదికపై ఆపసోపాలు పడుతోంది. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన వన్డే సిరీస్ భారత జట్టు ప్రమాణాలు క్రమంగా పడిపోతున్నాయనేందుకు మరో స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది. 2024లో భారత్‌లోనే తొలిసారిగా, అది కూడా 3-0 తేడాతో టెస్టు సిరీస్‌ను గెలిచి సంచలనం సృష్టించిన కివీస్, ఇప్పుడు ఈ దేశంలోనే తొలి వన్డే సిరీస్‌ను కూడా గెలిచి టీమ్ ఇండియాకు భారీ షాక్ ఇచ్చింది. గతంలో నాలుగు ఐసీసీ టోర్నీలు సహా వన్డే క్రికెట్ ఆడేందుకు 16 సార్లు భారత్‌కు వచ్చిన న్యూజిలాండ్ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేకపోయింది.
Details
తనపవర్ ప్లేలో వికెట్లు తీయడంలో విఫలం
అలాంటి కివీస్‌కు స్వదేశంలో వన్డే సిరీస్‌ను అప్పగించిన ఘనత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు తొలిసారిగా భారత పర్యటనకు వచ్చినప్పటికీ, న్యూజిలాండ్ క్రమశిక్షణతో కూడిన ఆటతీరుతో వన్డే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మరోవైపు భారత జట్టు మాత్రం ప్రణాళికల లోపాలు, గందరగోళ వ్యూహాలతో ఘోరంగా తడబడింది. బ్యాటింగ్‌లో అస్థిరత, బౌలింగ్‌లో ప్రభావం లేకపోవడం జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి. బౌలింగ్ విభాగం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్న పరిస్థితి నెలకొంది. పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో భారత బౌలర్లు విఫలమవడం కివీస్ బ్యాటర్లకు పూర్తిగా కలిసొచ్చింది. ఈసిరీస్‌లో భారత బౌలర్లు ఓవర్‌కు సగటున 6.2 పరుగులు ఇచ్చారు.
Details
నిరాశపరిచిన రవీంద్ర జడేజా
గత దశాబ్ద కాలంలో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌లలో ఇదే అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. స్పిన్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోవడం ఒకవైపు, స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడడం మరోవైపు జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. సిరీస్ మొత్తంలో రవీంద్ర జడేజా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ప్రత్యర్థి బ్యాటింగ్ మరింత దూకుడు పెంచుకుంది. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మినహా మిగతా ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మిడిల్ ఓవర్లలో పరుగుల వేటలో వెనుకబడటం భారత్‌కు ప్రతికూలంగా మారింది. ఫీల్డింగ్‌లోనూ ఆరు క్యాచ్‌లు వదిలేయడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
Details
కోచ్ గా అంచనాలను అందుకోలేకపోతున్న గంభీర్
ఈఓటమికి కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరించిన అస్పష్టమైన వ్యూహాలు కూడా కారణమని చెప్పొచ్చు. ఆటగాడిగా దూకుడును ప్రదర్శించిన గంభీర్, కోచ్‌గా మాత్రం అంచనాలకు అందుకోలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫామ్‌లో లేని జడేజాను పదే పదే ఆడించడం, అక్షర్ పటేల్ వంటి యువ ఆటగాళ్లను పక్కన పెట్టడం గంభీర్ చేసిన వ్యూహాత్మక తప్పిదాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలపై టెస్టు సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న గంభీర్, ఇప్పుడు వన్డే సిరీస్ పరాభవంతో మరింత ఒత్తిడిని ఎదుర్కోనున్న పరిస్థితి ఏర్పడింది. స్వదేశంలో భారత జట్టు ఆధిపత్యం ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఇకనైనా ప్రణాళికల్లో స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.