LOADING...
Yograj Singh: టీ20 వరల్డ్‌ కప్‌ 2026 జట్టులో గిల్‌కు చోటు ఎందుకు లేదు? : యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆగ్రహం
టీ20 వరల్డ్‌ కప్‌ 2026 జట్టులో గిల్‌కు చోటు ఎందుకు లేదు? : యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆగ్రహం

Yograj Singh: టీ20 వరల్డ్‌ కప్‌ 2026 జట్టులో గిల్‌కు చోటు ఎందుకు లేదు? : యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐ ఇటీవల ప్రకటించిన ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌-2026కు భారత జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌కు ఈసారి ఆ బాధ్యతతో పాటు జట్టులో స్థానం కూడా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. గిల్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌కు తిరిగి వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇదే జట్టు న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లోనూ బరిలోకి దిగనుంది. ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు. 'టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను జట్టులోంచి తొలగించడానికి అసలు కారణమేంటి? కేవలం నాలుగు లేదా ఐదు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌లో విఫలమైనందుకేనా?' అని ఆయన ప్రశ్నించారు.

Details

నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే తీసివేస్తారా

'మన దగ్గర వంద అవకాశాలు ఇస్తే కేవలం పది మ్యాచ్‌ల్లో మాత్రమే రాణించే క్రికెటర్లు కూడా ఉన్నారు. వాళ్లంతా ఇప్పటికీ జట్టులో కొనసాగుతూనే ఉన్నారు కదా?' అంటూ యూట్యూబ్‌ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే సందర్భంలో అభిషేక్‌ శర్మ ఉదాహరణను ప్రస్తావించిన యోగ్‌రాజ్‌ సింగ్‌, 'అభిషేక్‌ శర్మ రెండు సంవత్సరాల క్రితమే జట్టులోకి వచ్చాడు. అతడు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే అతనినీ జట్టులోంచి తీసివేస్తారా?' అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు కపిల్‌ దేవ్‌కు టీమ్‌ ఎలా అండగా నిలిచిందో, ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌కూ అలాగే మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆయన సూచించారు.

Details

జట్టు అండగా నిలబడాలి

ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేసిన యోగ్‌రాజ్‌ సింగ్‌, 'బిషన్‌ సింగ్‌ బేడీ సారథ్యంలో టీమిండియా పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో కపిల్‌ దేవ్‌ బ్యాట్‌తోనూ, బంతితోనూ విఫలమయ్యాడు. అయినప్పటికీ బిషన్‌ సింగ్‌ బేడీ అతన్ని ఇంగ్లాండ్‌ టూర్‌కు తీసుకెళ్లాడు' అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, విజయ్‌ హజారే ట్రోఫీ భాగంగా మరికాసేపట్లో జైపుర్‌ వేదికగా పంజాబ్‌, సిక్కిం జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగనున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించట్లేదని సమాచారం. అలాగే గిల్‌ మంగళవారం, జనవరి 6న గోవాతో జరగనున్న మ్యాచ్‌లోనూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Advertisement