IND vs SA: మూడో స్థానంలో గందరగోళం ఎందుకు..? భారత జట్టుకు ఆకాశ్ చోప్రా వార్నింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు బ్యాటింగ్ క్రమంలో ముఖ్యంగా మూడో స్థానానికి సంబంధించి స్పష్టత లేకపోవడం జట్టులో గందరగోళాన్ని పెంచుతోందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆక్షేపించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తరచూ ఆ స్థానంలో ప్రయోగాలు చేయడం వల్ల టీమ్ కాంబినేషన్ అస్థిరంగా మారుతోందని ఆయన విమర్శించాడు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ వాషింగ్టన్ సుందర్ టాప్ ఆర్డర్‌లోనూ ఆడగలడు, బౌలర్‌గా కూడా అతడికి అద్భుత ప్రతిభ ఉంది. కానీ ప్రతి సిరీస్‌కూ ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్ల జట్టులో స్పష్టత ఉండదు. సుందర్‌ను మూడో స్థానంలో స్థిరంగా ఆడించాలని ప్లాన్ ఉంటే, సాయిసుదర్శన్, కరుణ్ నాయర్‌లతో ఎందుకు ప్రయోగాలు చేశారు? వారి సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించాడు.
Details
ప్రయోగాలతో గందరగోళం సృష్టించకూడదు
బ్యాటింగ్‌లో ప్రతిభతో పాటు ఓర్పు కూడా ముఖ్యం. క్రీజులో స్థిరపడేందుకు అవసరమైన సమయాన్ని ప్లాన్ చేయాలి. స్పెషలిస్టులకు అవకాశాలు ఇవ్వాలి. పరుగులు చేస్తున్న సాయిసుదర్శన్‌ను జట్టు నుండి తప్పించి, అతనికి ఏ సందేశం ఇస్తున్నారు? 'నువ్వు బాగా ఆడుతున్నావు, కానీ మనం మనసు మార్చుకున్నాని చెప్పాలనుకుంటున్నారా? ప్రయోగాలు మంచివే కానీ అవి గందరగోళాన్ని సృష్టించకూడదని సూచించాడు. కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
Details
వారి సేవలను సరిగ్గా వినియోగించుకోలేదు
అతడు తొలి ఇన్నింగ్స్‌లో 29, రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులతో మెరుగైన ప్రదర్శన చూపించినా, బౌలింగ్‌లో మాత్రం అతడిని దాదాపు ఉపయోగించలేదు — మొత్తం మ్యాచ్‌లో కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసాడు, రెండో ఇన్నింగ్స్‌లో అసలు బౌలింగ్ చేయలేదు. నాలుగు స్పిన్నర్లను జట్టులోకి తీసుకొని, వారి సేవలను సరిగా వినియోగించకపోవడంపై కూడా విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా, ఆరుగురు లెఫ్ట్‌హ్యాండర్లతో జట్టును నింపేసినట్లు కనిపించడం అభిమానులు, విశ్లేషకుల ఆగ్రహానికి కారణమైంది. ఇదిలాఉంటే, గువాహటి వేదికగా రెండో టెస్టు రేపటి నుంచి (శనివారం) ప్రారంభం కానుంది.