Shubham Gill: గిల్‌ను ఎందుకు తప్పించారు? అసలు కారణాన్ని వెల్లడించిన సెలక్టర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు బీసీసీఐ భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ ఎంపికలో సెలక్టర్లు తీసుకున్న కీలక నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ టోర్నమెంట్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దేశవాళీ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ జట్టులోకి తిరిగి ఎంపికయ్యాడు. అలాగే ఫినిషర్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్‌కు కూడా చోటు దక్కింది.
Details
వికెట్ కీపర్ బ్యాటింగ్ చేస్తే అదనపు ప్రయోజనం ఉంటుంది
ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా జట్టు వివరాలను వెల్లడించారు. శుభ్‌మన్ గిల్‌ను తప్పించడంపై అజిత్ అగార్కర్ స్పందించారు. మేం సరైన జట్టు కాంబినేషన్ కోసం చూస్తున్నాం. టాప్ ఆర్డర్‌లో వికెట్‌కీపర్ బ్యాటింగ్ చేస్తే జట్టుకు అదనపు ప్రయోజనం ఉంటుంది. గిల్ ఎంత నాణ్యమైన ఆటగాడో మాకు తెలుసు. కానీ ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు... పూర్తిగా జట్టు అవసరాల కోసమేనని స్పష్టం చేశారు. ఇషాన్ కిషన్ వైట్ బాల్ క్రికెట్‌లో టాప్ ఆర్డర్‌లో ఆడగల సామర్థ్యం కలిగిన ఆటగాడని, ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడని అగార్కర్ పేర్కొన్నారు.
Details
స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాను ప్రకటించలేదు
ఈ అంశంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించారు. ఇది గిల్ ఫామ్‌కు సంబంధించిన విషయం కాదు. జట్టు సమతూకం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. టాప్ ఆర్డర్‌లో కీపర్ ఉండటం, లోయర్ ఆర్డర్‌లో రింకూ లాంటి మ్యాచ్ ఫినిషర్ ఉండటం మాకు కీలకమని వివరించారు. ప్రస్తుత జట్టు ఎంపికపై తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని, జట్టు చాలా బ్యాలెన్స్‌గా ఉందని సూర్యకుమార్ అభిప్రాయపడ్డారు. ఇక ఈసారి స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాను ప్రకటించలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.