Dhoni: ఐపీఎల్‌లో రసవత్తర సమరం.. ధోని బరిలోకి దిగుతాడా?
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్‌లో మరో రసవత్తర సమరం కోసం రంగం సిద్ధమైంది. యువ పేసర్ల అద్భుత ప్రదర్శనతో ఊపు మీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు, వరుస విజయాలతో మళ్లీ ఫామ్ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ గట్టి పోటీ ఇవ్వబోతోంది. అయిదు మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లు రెండేసి విజయాలతో సమాన స్థితిలో ఉండగా, వీరి మధ్య పోరు శనివారం ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. గాయం కారణంగా ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా అన్నది అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ధోని హైదరాబాద్‌కు రానున్నాడన్న సమాచారం వెలువడటంతో మ్యాచ్ టిక్కెట్లు వేగంగా అమ్ముడయ్యాయి.
వివరాలు
గాయంతో సీజన్ మొత్తానికి దూరం..
రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సీనియర్ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ స్థానంలో జట్టులోకి వచ్చిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్‌కు గుర్తుంచుకునే విజయాన్ని అందించారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి వంటి బలమైన బ్యాటింగ్ లైనప్‌కు ఇప్పుడు ప్రఫుల్, సకిబ్ వంటి యువ బౌలర్ల మద్దతు కలగడంతో సన్‌రైజర్స్ బలం మరింత పెరిగింది. మరోవైపు, చెన్నై జట్టు రెండు విజయాలను సాధించింది. సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం వారికి ఊరటనిచ్చింది. అయితే గాయాల సమస్య చెన్నైను ఇంకా వెంటాడుతోంది. పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
వివరాలు
ధోని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడా?
ధోని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడా? ఈ మ్యాచ్‌లో ఆడతాడా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ అతను మైదానంలో ఆడకపోయినా, కనీసం డగౌట్‌లో కనిపించే అవకాశముంది. ఇదిలా ఉంటే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లో లేక చెన్నైకు ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో ఆయుష్ మాత్రేను ఓపెనర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శనివారం మరో మ్యాచ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న బెంగళూరు జట్టును, కొంత అస్థిరంగా కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఎదుర్కోనుంది.