IND vs SA 5th T20: నేడు సౌతాఫ్రికాతో చివరి టీ20.. సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంటుందా?
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 19) జరిగే చివరి టీ20 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే పర్యాటక జట్టుకు సిరీస్ గెలిచే అవకాశాలు లేవు. అయితే చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేసుకునే అవకాశమైతే దక్షిణాఫ్రికాకు ఉంది. ఇదిలా ఉండగా ప్రాక్టీస్ సమయంలో గాయపడిన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో టీ20కి అందుబాటులో ఉండడని ముందే ప్రకటించారు. అయితే ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గిల్ జట్టుతో పాటు అహ్మదాబాద్‌కు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ, ఆఖరి టీ20లో అతడు తుది జట్టులో ఉంటాడా? లేదా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
Details
గిల్ అవకాశాలు ఇవ్వడంపై విమర్శలు
మరోవైపు, సంజూ శాంసన్‌ను డగౌట్‌కే పరిమితం చేస్తూ వరుసగా విఫలమవుతున్న గిల్‌కు ప్రతి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడంపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేమి కొనసాగుతూనే ఉంది. సారథిగా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ, వ్యక్తిగత బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. అయితే, మిడిలార్డర్‌లో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపించడం జట్టుకు కలిసొచ్చే అంశం. బౌలింగ్ విభాగంలో బుమ్రా జట్టులో చేరడం సానుకూలంగా మారింది. మరో పేసర్ హర్షిత్‌ను కొనసాగిస్తారా?లేక స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇస్తారా? అన్నది తుది జట్టులో తేలనుంది.
Details
రాణిస్తున్న సౌతాఫ్రికా బ్యాటర్లు
మరోవైపు ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఒడిదుడుకుల మధ్య ముందుకు సాగుతోంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో నిలకడ లోపించడం ఆ జట్టును వేధిస్తోంది. చివరి మ్యాచ్‌లో అయినా సమష్టి ప్రదర్శనతో భారత్‌ను ఎదుర్కోవాలని ప్రోటీస్ జట్టు భావిస్తోంది. ఓపెనర్ రీజా హెన్‌డ్రిక్స్ వరుసగా విఫలమవుతుండటంతో కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ఆ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. మరో ఓపెనర్ డికాక్ రెండో మ్యాచ్‌లో శతకంతో మెరిశాడు. అతడు పూర్తి ఫామ్‌లోకి వస్తే భారత బౌలర్లకు గట్టి సవాల్‌గా మారే అవకాశముంది. అయితే, హిట్టర్లు బ్రెవిస్, మిల్లర్ ఈ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. పేస్ ఆల్‌రౌండర్ యాన్సెన్ బౌలింగ్‌లో పరవాలేదనిపిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన మెరుపులు చూపడం లేదు.
Details
పిచ్, వాతావరణం
పేస్ విభాగంలో నోకియా విఫలమవుతున్నా, ఎన్‌గిడి, బార్ట్‌మన్ మాత్రం భారత బ్యాటింగ్‌ను కాస్త ఇబ్బంది పెడుతున్నారు. అహ్మదాబాద్‌లో సుమారు 30 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలతో కూడిన వాతావరణం ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పొగమంచు సమస్య ఉండే అవకాశం లేదని స్పష్టం చేయడంతో మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని తెలుస్తోంది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఇరు జట్లు భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Details
ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే
భారత జట్టు ఇదే అభిషేక్, గిల్/శాంసన్, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, దూబే, హర్షిత్/సుందర్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్. దక్షిణాఫ్రికా జట్టు ఇదే డికాక్, మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్‌డ్రిక్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, యాన్సెన్, బాష్, లిండే/నోకియా, ఎన్‌గిడి, బార్ట్‌మన్.