ఆసియా కప్‌కు టీమిండియా దూరం కానుందా? హైబ్రిడ్ మోడల్ పై బీసీసీఐ ఏం చెప్పిందంటే?
ఆసియా కప్ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ లీగ్ కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్థాన్ కు దక్కింది. అయితే తమ జట్టును భద్రతా కారణాల దృష్ట్యా పాక్ కు పంపమని బీసీసీఐ తేల్చి చెప్పింది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సౌథీ సూచించిన హైబ్రిడ్ మోడల్‌కు బీసీసీఐ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా దీనిపై అనధికారికంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ పెద్దలకు సమాచారం ఇచ్చారని టాక్ నడుస్తోంది. అయితే ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ఏసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది.
హైబ్రిడ్ మోడల్ కు బీసీసీఐ నో
శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ జట్లు పాక్ లో ఆడేందుకు సుముఖంగానే ఉన్నా భారత్ మాత్రం హైబ్రిడ్ మోడల్ కు అంగీకారం తెలపడం లేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో మొత్తం 25 సభ్యదేశాలు ఉన్నా.. ఇందులో టెస్టులు ఆడే 5 దేశాలకే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. హైబ్రిడ్ మోడల్ లో మ్యాచులన్నీ పాక్ లో జరగనుండగా.. భారత్ తో జరిగే మ్యాచులు మాత్రం యూఏఈ, దుబాయి, ఒమన్, శ్రీలంక దేశాల్లో ఆడొచ్చని సూచించింది. టోర్నీని తటస్థ వేదికలో నిర్వహించేందుకు మిగతా దేశాలు మద్దతిస్తాయో లేదో వేచి చూడాలి. మరోవైపు పాకిస్థాన్ కూడా ఇండియాలో జరిగే వరల్డ్ కప్ మ్యాచులను బహిష్కరిస్తామని ఇంతకుముందే ప్రకటించిన విషయం తెలిసిందే.