బీసీసీఐ దెబ్బకు పాక్ నుంచి ఆసియా కప్ తరలింపు.. శ్రీలంకకి ఆతిథ్యం ఛాన్స్?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి గట్టి షాకిచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి ఆసియాకప్- 2023 క్రికెట్ టోర్నీ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.
టోర్నీ వేదికను పాకిస్థాన్ నుంచి శ్రీలంకకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆసియాకప్ కోసం పాకిస్థాన్ కు టీమిండియా జట్టును పంపేది లేదని బీసీసీఐ ఖరాఖండీగా చెప్పిన విషయం తెలిసిందే.
అయితే భారత్ తన మ్యాచ్ లను యూఏఈలో ఆడేందుకు పాకిస్థాన్ చేసిన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను మిగిలిన సభ్య దేశాలు తిరస్కరించాయి. ఒకవేళ భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్ లు ఉంటే మూడోజట్టు అటు పాకిస్థాన్, ఇటు యూఏఈకి తిరగాల్సి ఉంటుంది.
Details
హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను తిరస్కరించిన సభ్య దేశాలు
ఈ క్రమంలో ఆటగాళ్లు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. దీంతో సభ్య దేశాలు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను తిరస్కరించాయి. ఆసియా కప్ ను పాకిస్థాన్ లో కాకుండా యూఏఈలో నిర్వహించాలని తొలుత ఏసీసీ భావించింది.
టోర్నీ జరిగే సమయంలో యూఏఈలో అత్యంత తేమతో కూడిన పరిస్థితుల వల్ల ఆటగాళ్లకు గాయాలయ్యే ఛాన్స్ ఉంది. దాదాపుగా శ్రీలంకలో ఆసియా కప్ టోర్నీ నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంగళవారం రెండో దఫా చర్చలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఏసీసీ తన మనసు మార్చకుంటుందేమోనని పాక్ ఆశతో ఉంది. మొత్తానికి బీసీసీఐ దెబ్బకు పీసీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు.