వింబుల్డన్: అండ్రీ రుబ్లెవ్‌ను చిత్తు చేసిన నోవాక్ జకోవిచ్
సెర్బియన్ స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ టెన్నిస్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. 2023 వింబుల్డన్‌లో ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్‌లో ఆండ్రీ రుబ్లెవ్‌ను 4-6, 6-1, 6-4, 6-3 తేడాతో నొవాక్ జొకోవిచ్ చిత్తు చేశాడు. దీంతో వింబుల్డన్‌లో 12వ సారి సెమీఫైనల్‌కు వెళ్లిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. అదే విధంగా 400 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన రెండో వ్యక్తిగా జకోవిచ్ నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రుబ్లెవ్ ఆరు ఏస్‌లు కొట్టగా, జొకోవిచ్ ఐదు ఏస్‌లు నమోదు చేశాడు. జకోవిచ్ మొదటి సర్వేలో 76 శాతం, రెండో సర్వేలో 65 శాతం విజయాన్ని నమోదు చేశాడు. రుబ్లెవ్ ఈ మ్యాచులో 3882.1 మీటర్ల దూరాన్ని అధిగమించగడం విశేషం.
పురుషుల కేటగిరీలో అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న ఆటగాడిగా జకోవిచ్
జకోవిచ్ ఈ వింబుల్డన్ టోర్నీలో టైటిల్‌ను గెలిస్తే.. ఎనిమిది వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన రోజర్ ఫెదరర్‌తో రికార్డును సమం చేయనున్నాడు. ఫెదరర్ 2003-2007, 2009, 2012, 2017లో వింబుల్డన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ రోజర్ ఫెదరర్ 429 గ్రాండ్ స్లామ్ మ్యాచులు ఆడి మొదటి స్థానంలో ఉండగా, జకోవిచ్ 400 మ్యాచులతో రెండో స్థానంలో నిలిచాడు. జకోవిచ్ చివరిసారిగా 2016లో వింబుల్డన్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. జకోవిచ్ గ్రాండ్‌స్లామ్‌లలో 353 మెయిన్-డ్రా మ్యాచ్‌లు గెలుచుకున్నాడు. ఈ విషయంలో అతను ఫెదరర్ (369), విలియమ్స్ (367) తర్వాత స్థానంలో నిలిచాడు. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పురుషుల కేటగిరీలో అత్యధిక టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా జోకొవిచ్ నిలిచాడు.