Loading...
INDW vs JPNW: స్వర్ణమే లక్ష్యంగా.. అమ్మాయిలకు ఎదురుందా!
స్వర్ణమే లక్ష్యంగా.. అమ్మాయిలకు ఎదురుందా!

INDW vs JPNW: స్వర్ణమే లక్ష్యంగా.. అమ్మాయిలకు ఎదురుందా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ గెలిచి జోరు మీదున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు.. మరో సమరానికి సిద్ధమైంది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత జట్టు ఆతిథ్య జపాన్‌తో తలపడనుంది. ఆసియా కప్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఓపెనర్‌ షెఫాలి వర్మ మరోసారి భారత్‌కు కీలకం కానుంది. మరో ఓపెనర్‌ స్మృతి మంధాన కూడా మంచి ఫామ్‌లోనే ఉంది. స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి తమ జోరును కొనసాగించాల్సి ఉంది. గాయాల నుంచి కోలుకుని రాధా యాదవ్‌, శ్రేయాంక పాటిల్‌ జట్టులోకి రావడంతో భారత జట్టు ప్రత్యామ్నాయాలు మరింత పెరిగాయి.

వివరాలు

బంగ్లా నేరుగా సెమీస్‌కు..

రేణుక, నందని, క్రాంతి గౌడ్‌లతో భారత పేస్‌ విభాగం కూడా బలంగా ఉంది.

సొంతగడ్డపై ఆడుతున్న జపాన్‌.. భారత్‌కు ఏమేరకు పోటీ ఇవ్వగలదో చూడాలి. మహిళల క్రికెట్‌ విభాగంలో ఎనిమిది జట్లు మాత్రమే పాల్గొంటున్నాయి.

దీంతో పోటీలు క్వార్టర్‌ఫైనల్‌ నుంచే ప్రారంభమవుతున్నాయి. మహిళల క్రికెట్‌ పోటీల్లో బంగ్లాదేశ్‌ నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం బంగ్లాదేశ్‌-చైనా మధ్య జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్‌ పోరు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.

చైనా 36వ ర్యాంకులో ఉండగా.. బంగ్లాదేశ్‌ 10వ ర్యాంకులో ఉంది. దీంతో చైనా కంటే అత్యధిక అంతర్జాతీయ రేటింగ్‌ ఉన్న బంగ్లాదేశ్‌ ముందంజ వేసింది. మరోవైపు పాకిస్థాన్‌ కష్టపడి క్వార్టర్‌ఫైనల్‌ దాటింది.

వివరాలు

ఓటమిపాలైన థాయ్‌లాండ్

ఆ జట్టు 3 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన థాయ్‌లాండ్‌ 11 ఓవర్లలో 4 వికెట్లకు 91 పరుగులు చేసింది.

ననాపత్‌ (49) ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. పాకిస్థాన్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా (2/22) రాణించింది.

91 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 10.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

ఛేదనలో షవాల్‌ జుల్ఫికర్‌ (25), గుల్‌ ఫెరోజా (16) రాణించారు. కెప్టెన్‌ ఫాతిమా సనా (21), తుబా హసన్‌ (13) జట్టును ఆదుకున్నారు. అనంతరం పాకిస్థాన్‌ మరోసారి తడబడినప్పటికీ.. చివరికి లక్ష్యాన్ని చేరుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

ADVERTISEMENT