
South Africa World Cup Final: చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా; ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్లోకి
ఈ వార్తాకథనం ఏంటి
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20ప్రపంచ కప్ 2023లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. న్యూలాండ్స్‌లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అటు పురుషుల జట్టు కానీ, ఇటు మహిళల జట్టు కానీ ఇంతవరకు వరల్ట్ కప్‌లో ఫైనల్‌కు వెళ్లలేదు. ఇంగ్లండ్‌ను ఓడించి సొంతగడ్డపై తొలిసారిగా ఫైనల్‌లోకి అడుగు పెట్టింది.
తొలుత బ్యాంటిగ్ చేసిన దక్షిణాఫ్రికా 164 పరుగులు చేసింది. ఓపెనర్లు వాల్వార్ద్‌త్( 53), టాజ్మిన్(68)అర్ధ సెంచరీలతో రాణించడంతో పాటు క్యాప్(27) వారికి తోడుగా నిలవడం వల్ల జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి ఇంగ్లండ్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
వరల్డ్ కప్
ఆరో ఓవర్ నుంచి ఇంగ్లండ్ వికెట్ల పతనం
టోర్నీలోనే పటిష్టమైన జట్టుగా పేరున్న ఇంగ్లండ్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదని అంతా అనుకున్నారు. వాస్తవానికి రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే లభించింది. పవర్ ప్లే ముగిసే సరికి ఓపెనర్లు వ్యాట్, సోఫియా 53పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు.
అయితే ఆరో ఓవర్ నుంచి ఇంగ్లండ్ వికెట్ల పతనం ప్రారంభమైంది. సఫారీ జట్టు బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ జట్టుకు పరుగులు తీయడం చాలా కష్టమైపోయింది.
ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇంగ్లండ్ ఆరు పరుగులు మాత్రమే చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తం మీద 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి, 158 పరుగులు చేసింది.