Women's World Cup: భారత అమ్మాయిలకు కఠిన సవాల్.. ఆస్ట్రేలియాతో సెమీస్ నేడు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే మహిళల ప్రపంచకప్ గ్రూప్ దశలో మోస్తరు ప్రదర్శనతోనే సెమీఫైనల్ బర్త్ సాధించిన భారత జట్టు, ఇక నాకౌట్ పోరులో మాత్రం తన సత్తా చాటాల్సిందే. ఎందుకంటే సెమీస్‌లో ఎదురయ్యేది ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఒక్క ఓటమీ చూడని జట్టు కంగారూలే కావడంతో, ఫేవరెట్ అనే బిరుదు వారికి సరిగ్గా సరిపోతుంది. గ్రూప్ దశలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా వారు విజయం సాధించారు.అయితే ఆ మ్యాచ్‌లోనూ భారత్ 330 పరుగులు చేయడంతో చివరి వరకు పోరాటస్ఫూర్తి చూపించింది. ప్రపంచకప్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ భారత్ మెరుగ్గా ఆడింది. ఒక మ్యాచ్ నెగ్గి, మరో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వెళ్లింది.
వివరాలు
2017 గెలుపు స్ఫూర్తిగా…
ఈ నేపథ్యంలో గురువారం జరిగే సెమీస్‌లో కూడా అదే నమ్మకంతో ఆడి, ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆస్ట్రేలియా మేటి జట్టే. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది కూడా. గతంలోనూ భారత్ నాకౌట్ దశలో కంగారూలను షాక్‌కు గురిచేసింది. ముఖ్యంగా 2017 సెమీఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయంగా 171 పరుగులు చేసి జట్టును గెలిపించింది. ఆ హర్మన్‌ప్రీత్ ఇప్పుడు కెప్టెన్. ఈ టోర్నీలో ఆమె ఫామ్‌లో లేకపోయినా, సెమీస్‌లో సత్తా చాటుతుందన్న నమ్మకం ఉంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ బాగానే రాణిస్తున్నారు. ప్రతీక రావల్ గాయంతో జట్టుకు దూరం కావడం ఒక ప్రతికూలత అయినా, షెఫాలి వర్మ రూపంలో జట్టుకు తగిన ఓపెనర్ దొరికింది.
వివరాలు
సెమీస్‌లో రాధ యాదవ్‌కి అవకాశం
ప్రధాన బ్యాటర్లు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే, భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. అలాగే భారత బౌలర్లు ఆస్ట్రేలియాను 250-260 మధ్యలోనే కట్టడి చేయగలిగితే విజయావకాశాలు మెరుగవుతాయి. బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన రాధ యాదవ్‌కి సెమీస్‌లో అవకాశం లభించే అవకాశం ఉంది. ఆమెతో పాటు దీప్తి, శ్రీ చరణి స్పిన్‌కు అనుకూలమైన డీవై పాటిల్ స్టేడియం పిచ్‌ను సద్వినియోగం చేసుకుంటే కంగారూలపై ప్రభావం చూపగలరు. పాక్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యమని అప్పటికే నిరూపితమైంది. రేణుక సింగ్, అమన్‌జ్యోత్, క్రాంతి గౌడ్‌లతో కూడిన పేస్ విభాగం కూడా బలంగా ఉంది. ప్రారంభంలోనే వికెట్లు తీసి ఒత్తిడిని పెంచగలిగితే, తర్వాత స్పిన్నర్లు మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తీసుకోవచ్చు.
వివరాలు
డీవై పాటిల్ స్టేడియం — బ్యాటింగ్, స్పిన్‌కు అనుకూలం
అయితే చివరిదాకా పట్టు నిలబెట్టుకోవడం, ముఖ్యంగా కీలక దశల్లో తప్పిదాలు చేయకపోవడం అత్యంత ముఖ్యం. గ్రూప్ దశలో ఒత్తిడికి లోనై గెలిచే మ్యాచ్‌ను కోల్పోయిన భారత్, ఈసారి ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. సెమీఫైనల్ జరగనున్న డీవై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే స్పిన్నర్లు ఇక్కడ బాగా రాణిస్తారు. భారత్ బంగ్లాదేశ్‌తో తన చివరి లీగ్ మ్యాచ్ ఇదే మైదానంలో ఆడింది. 27 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు విరుచుకుపడి బంగ్లాను 119/9 వద్దనే నిలిపారు. సెమీస్ రోజున కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
వివరాలు
ఆస్ట్రేలియాకు తిరుగులేదు కానీ…
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో ఆస్ట్రేలియా దాదాపు సంపూర్ణంగా కనిపిస్తోంది. అలీసా హీలీ,ఫోబ్ లిచ్‌ఫీల్డ్ జట్టుకు చక్కని ఆరంభాన్ని ఇస్తారు.మూడో స్థానంలో ఆడే ఎలీస్ పెర్రీ పాత ఫామ్‌లో లేకపోయినా, భారత్‌పై గతంలో విజయం సాధించిన ఇన్నింగ్స్ ఆమెదే. బెత్ మూనీ ఫామ్‌లో ఉండడం మరో అదనపు బలం. ఆల్‌రౌండర్లు ఆష్లీ గార్డ్‌నర్, అనాబెల్ సదర్లాండ్ ఇద్దరూ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌పై విజయంలో ఈ ఇద్దరి భాగస్వామ్యం కీలకం. గార్డ్‌నర్ ఇప్పటికే రెండు శతకాలు సాధించింది, అవి రెండూ క్లిష్ట పరిస్థితుల్లోనే వచ్చాయి.
వివరాలు
ఆస్ట్రేలియాకు తిరుగులేదు కానీ…
అనాబెల్ బంతితోనూ సతత ప్రదర్శన ఇస్తోంది. తాలియా మెక్‌గ్రాత్ ఫామ్ మాత్రం జట్టుకు కొంత ఆందోళన కలిగిస్తోంది. మెగాన్ షట్, కిమ్ గార్త్, అలానా కింగ్, సోఫీ మోలనూయూ వంటి బౌలర్లు కూడా మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తున్నారు. ఈ జట్టులో ప్రతి ఆటగాడు.. బ్యాటర్ అయినా, బౌలర్ అయినా.. అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యంతో ప్రసిద్ధి చెందారు.
వివరాలు
తుది జట్లు (అంచనా)
భారత్: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్, స్నేహ్ రాణా, రాధ యాదవ్, శ్రీ చరణి, రేణుక సింగ్. ఆస్ట్రేలియా: అలీసా హీలీ (కెప్టెన్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అనాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, సోఫీ మోలనూ, అలానా కింగ్, కిమ్ గార్త్, మెగాన్ షట్.