ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి
ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులకు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు కూడా భారతదేశం వస్తుంది. ఈ నేపథ్యంలో భద్రతా విషయాన్ని పరిశీలించేందుకు వరల్డ్ కప్ మ్యాచులు మొదలవ్వడానికి ముందే పాక్ భద్రతా ప్రతినిధి ఇండియా రానున్నారు. పాకిస్థాన్ ఆడే మైదానాల్లో భద్రత గురించి తనిఖీ చేయనున్నారు. క్రికెటర్లు, మీడియా వాళ్ళు, అభిమానుల భద్రత కోసం తనిఖీ ఉంటుందని పీసీబీ భద్రతా ప్రతినిధి వెల్లడి చేసారు.
తనిఖీ ఒక సాధారణ ప్రక్రియ
ఇలాంటి తనిఖీలు నిర్వహించినపుడు ఏవైనా ఇబ్బందికర పరిస్థితులను గుర్తిస్తే, ఐసీసీ, బీసీసీఐలకు నివేదిక పంపుతామని పీసీబీ ప్రతినిధి తెలియజేసారు. కేవలం క్రికెట్ కోసమే కాకుండా, వేరే గేమ్స్ కోసం ఇండియా రావాలనుకుంటే ఇలాంటి తనిఖీ ఖచ్చితంగా ఉంటుందని, ఇది సాధారణ ప్రక్రియ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ భద్రతా ప్రతినిధి అన్నారు. అదలా ఉంచితే, వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 15వ తేదీన అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.