Page Loader
WPL: అదరగొట్టిన స్మృతి.. ఆర్సీబీ చేతిలో ఢిల్లీ చిత్తు
అదరగొట్టిన స్మృతి.. ఆర్సీబీ చేతిలో ఢిల్లీ చిత్తు

WPL: అదరగొట్టిన స్మృతి.. ఆర్సీబీ చేతిలో ఢిల్లీ చిత్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరు తన విజయ పరంపరను కొనసాగించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత దిల్లీ జట్టు 19.3 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (34) అత్యధిక పరుగులు చేశారు. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రేణుక (3/23), వేర్‌హామ్‌ (3/25) ముఖ్యమైన వికెట్లు తీసి ప్రత్యర్థిని కష్టాల్లోకి నెట్టారు. అనంతరం స్మృతి మంధాన (81; 47 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు), డానీ వ్యాట్‌ (42) విజృంభించడంతో ఆర్సీబీ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

వివరాలు 

బెంగళూరు ఆధిపత్య ప్రదర్శన 

టార్గెట్‌ ఛేదనలో బెంగళూరు మెరుపు ఆరంభాన్ని అందుకుంది. స్మృతి మంధాన దూకుడుగా ఆడి దిల్లీ బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చింది. డానీ వ్యాట్‌ నుంచి చక్కటి సహకారం అందడంతో ఆర్సీబీ 6 ఓవర్లలో 57/0 స్కోరుతో దూసుకెళ్లింది. మంధాన తన శైలి ప్రదర్శిస్తూ ఆఫ్‌సైడ్‌లో అద్భుతమైన ఫోర్లు బాదింది. అరుంధతి, మరిజేన్‌ కాప్‌ బౌలింగ్‌లో మెరుపు సిక్సర్లు కొట్టి జట్టును గెలుపు దిశగా నడిపించింది. వ్యాట్‌ కూడా తన స్టైల్‌లో ఆడి స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లింది. 10 ఓవర్లకు 102/0తో బెంగళూరు విజయాన్నిఖాయం చేసుకుంది . స్మృతి కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేసుకుంది. దిల్లీ కెప్టెన్‌ లానింగ్‌ ఆర్సీబీ ఓపెనింగ్‌ జోడిని విడదీయడానికి పవర్‌ప్లేలోనే ఆరుగురు బౌలర్లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది.

వివరాలు 

దిల్లీ ఇన్నింగ్స్ - ఒడుదొడుకులు 

11వ ఓవర్లో అరుంధతి రెడ్డి డానీ వ్యాట్‌ను ఔట్‌ చేసినప్పటికీ అప్పటికే బెంగళూరు విజయానికి బలమైన పునాది పడిపోయింది. స్మృతి-వ్యాట్‌ తొలి వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో స్మృతి ఔటైనా, రిచా (11 నాటౌట్‌), పెర్రీ (7 నాటౌట్‌) మిగిలిన పని పూర్తి చేశారు. 22 బంతులు మిగిలుండగానే ఆర్సీబీ గెలుపును ఖాయం చేసింది. దిల్లీ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. రెండో బంతికే షెఫాలీ వర్మ (0) రేణుక బౌలింగ్‌లో ఔట‌య్యింది. జెమీమా రోడ్రిగ్స్‌ (34) కెప్టెన్‌ లానింగ్‌ (17)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసింది. జెమీమా దూకుడుగా ఆడటంతో స్కోరు వేగంగా పెరిగింది.

వివరాలు 

బెంగళూరు వరుసగా రెండో విజయం 

ఐదో, ఆరో ఓవర్లలో ఆమె మెరుపులు మెరిపించడంతో దిల్లీ 29 పరుగులు సాధించింది. ఏక్తా బౌలింగ్‌లో ఇన్‌సైడ్‌ ఔట్‌ షాట్‌తో జెమీమా కొట్టిన సిక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవర్‌ప్లే ముగిసేసరికి దిల్లీ 55/1తో మంచి స్థితిలో కనిపించింది.అయితే ఓవర్ల తేడాతో జెమీమా, లానింగ్‌ ఔట‌ కావడంతో దిల్లీకి దెబ్బ తగిలింది. ఆర్సీబీ స్పిన్నర్లు విజృంభించడంతో దిల్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో సారా బ్రేస్‌ (23),అనాబెల్‌ (19),శిఖా పాండే (14) కాసేపు నిలవడంతో డీసీ పోరాడే స్కోరు సాధించగలిగింది. బెంగళూరు బౌలర్లలో రేణుక, వేర్‌హామ్‌తో పాటు కిమ్‌ గార్త్‌ (2/19), ఏక్తా (2/35) కూడా రాణించి దిల్లీని త్వరగా ఆలౌట్‌ చేశారు. ఈ విజయంతో బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.