Page Loader
WTC Final 2025: లార్డ్స్‌లో బౌలర్ల హవా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి రోజు 14 వికెట్లు
లార్డ్స్‌లో బౌలర్ల హవా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి రోజు 14 వికెట్లు

WTC Final 2025: లార్డ్స్‌లో బౌలర్ల హవా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలి రోజు 14 వికెట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆసక్తికరంగా మొదలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 212 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడ (5/51), యాన్సెన్‌ (3/49) లు చెలరేగిపోవడంతో ఆసీస్‌ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. కానీ వెబ్‌స్టర్‌ (72; 92 బంతుల్లో 11 ఫోర్లు), స్మిత్‌ (66; 112 బంతుల్లో 10 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడుతూ తమ జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మరింతగా తడబడింది. ఆట ముగిసే సమయానికి వారు 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయారు. బవుమా (3), బెడింగ్‌హామ్‌ (8) క్రీజులో ఉన్నారు. స్టార్క్‌ ఇద్దరు ఆటగాళ్లను వెనక్కి పంపి దక్షిణాఫ్రికాను కష్టాల్లో నెట్టాడు.

వివరాలు 

దక్షిణాఫ్రికా తడబాటు: 

ప్రస్తుతానికైతే స్పష్టంగా ఆస్ట్రేలియాదే పైచేయి. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో మెరిసినా.. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన తర్వాత కూడా తొలి రోజు ఆ జట్టు తన ఆటతీరు ద్వారా నిరాశ పరచింది. స్టార్క్‌ ఆరంభంలోనే గట్టి దెబ్బతీశాడు. ఓపెనర్లు మార్‌క్రమ్‌ (0), రికిల్‌టన్‌ (16) లను వెనక్కి పంపాడు. తొలి ఓవర్లోనే ఇన్‌స్వింగింగ్‌ డెలివరీతో మార్‌క్రమ్‌ను బౌల్డ్‌ చేయగా, తర్వాత రికిల్‌టన్‌ ఔట్‌స్వింగర్‌ను ఆడబోయి ఎడ్జ్‌ చేసి ఖవాజాకు క్యాచ్‌ ఇచ్చాడు. ముల్డర్‌ (6)ను కమిన్స్‌, స్టబ్స్‌ (2)ను హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్‌ బవుమా, బెడింగ్‌హామ్‌ జాగ్రత్తగా ఆడి వికెట్‌ పడకుండా ఆటను ముగించారు.

వివరాలు 

కంగారూలకు కళ్లెం:

అయితే బవుమా మాత్రం ఎదుర్కొన్న 31వ బంతికి గానీ అతడు ఖాతా తెరవలేకపోవడం గమనార్హం. అంతకుముందు ఆస్ట్రేలియా జట్టు బ్యాటుతో తడబడింది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ బవుమా ఫీల్డింగ్‌ను ఎంచుకోవడం సరికొత్త మలుపు ఇచ్చింది. మబ్బు వాతావరణం, సహాయపడే పిచ్‌ బౌలర్లకు అనుకూలంగా మారాయి. రబాడ, యాన్సెన్‌ లు కొత్త బంతితో ఆసీస్‌ టాపార్డర్‌ను గడగడలాడించారు. రబాడ మూడు మెయిడెన్‌ ఓవర్లతో బౌలింగ్‌ ప్రారంభించి ఖవాజా (0), గ్రీన్‌ (4) లను తక్కువ స్కోరుకే వెనక్కి పంపాడు. ఖవాజా ఫోర్త్‌ స్టంప్‌పై బంతిని ఆడబోయి ఫస్ట్‌ స్లిప్‌లో బెడింగ్‌హామ్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. గ్రీన్‌ కూడా అదే తరహాలో ఎడ్జ్‌తో రెండో స్లిప్‌లో మార్‌క్రమ్‌ చిక్కాడు.

వివరాలు 

లంచ్‌ తర్వాత పుంజుకున్న ఆసీస్‌

స్మిత్‌తో లబుషేన్‌ (17) జతకట్టినా, యాన్సెన్‌ అతడిని త్వరగానే అవుట్‌ చేశాడు. లబుషేన్‌ ఆఫ్‌స్టంప్‌ వెలుపల బంతిని ఆడబోయి వెరీన్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. లంచ్‌కు ముందు హెడ్‌ (11) కూడా వెరీన్‌ చేతికి చిక్కడంతో, దక్షిణాఫ్రికా మొదటి సెషన్‌ను పూర్తి ఆధిపత్యంతో ముగించింది. కానీ లంచ్ తరువాత పుంజుకున్న ఆసీస్‌.. రెండో సెషన్లో ఒకే ఒక వికెట్‌ కోల్పోయింది. స్మిత్‌, వెబ్‌స్టర్‌ మెల్లగా జట్టును నిలబెట్టారు. ఇద్దరూ బౌలర్లను అర్థం చేసుకుంటూ బౌండరీలు కొడుతూ స్కోరు ముందుకు నడిపించారు. ఆస్ట్రేలియా 146/4తో తిరిగి పుంజుకుంది. అయితే మార్‌క్రమ్‌ పార్ట్‌టైం ఆఫ్‌స్పిన్‌తో స్మిత్‌ను ఔట్‌ చేయడంతో ఆ జట్టుకు దెబ్బ తగిలింది. స్మిత్‌ ఆఫ్‌స్టంప్‌ బయట బంతిని కవర్‌డ్రైవ్‌ ఆడబోయి యాన్సెన్‌ చేతికి చిక్కాడు.

వివరాలు 

ఆఖరి సెషన్‌లో ఆసీస్‌ పతనం: 

అప్పటికే అతడు వెబ్‌స్టర్‌తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. తర్వాత వెబ్‌స్టర్‌కు కేరీ (23) తోడయ్యాడు. టీ విరామానికి ఆసీస్‌ 190/5తో నిలిచింది. వెబ్‌స్టర్‌ తన రెండో టెస్టు అర్ధశతకం పూర్తి చేశాడు. ఆస్ట్రేలియా మంచి స్కోరు దిశగా సాగుతున్న సమయంలో చివరి సెషన్‌లో తడబాటుకు లోనైంది. 5.4 ఓవర్ల వ్యవధిలోనే ఆఖరి అయిదు వికెట్లు కోల్పోయింది. మహరాజ్‌ కేరీని బౌల్డ్‌ చేయడంతో ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి ఫుల్ స్టాప్ పడింది. వెంటనే రబాడ.. కమిన్స్‌ (1), వెబ్‌స్టర్‌ లను ఔట్‌ చేశాడు. లైయన్‌ (0)ను యాన్సెన్‌ బౌల్డ్‌ చేయగా, స్టార్క్‌ చివరగా రబాడ బలిగా మారాడు. ఫలితంగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 212 పరుగులకే ముగిసింది.

వివరాలు 

డొనాల్డ్‌ను దాటిన రబాడ 

ఈ మ్యాచ్‌లో రబాడ ఐదు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.. 71 టెస్టుల్లో 332 వికెట్లు సాధించిన రబాడ.. డొనాల్డ్‌ (330 వికెట్లు, 72 టెస్టులు) ను అధిగమించాడు. స్టెయిన్‌ (439), షాన్‌ పొలాక్‌ (421), మఖాయా ఎంటినీ (390) అతని ముందున్న ముగ్గురు. అంతేకాదు, రబాడ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఐదు వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా కూడా నిలిచాడు. అతని ముందు కేవలం న్యూజిలాండ్‌ బౌలర్‌ కైల్‌ జేమీసన్‌ మాత్రమే ఉన్నాడు.

వివరాలు 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 

ఉస్మాన్‌ ఖవాజా (సి) బెడింగ్‌హామ్‌ (బి)రబాడ 0; లబుషేన్‌ (సి) వెరీన్‌ (బి)యాన్సెన్‌ 17; కామెరాన్‌ గ్రీన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) రబాడ 4; స్మిత్‌ (సి)యాన్సెన్‌ (బి) మార్‌క్రమ్‌ 66; హెడ్‌ (సి) వెరీన్‌ (బి)యాన్సెన్‌ 11; వెబ్‌స్టర్‌ (సి)బెడింగ్‌హామ్‌ (బి)రబాడ 72; అలెక్స్‌ కేరీ (బి)మహరాజ్‌ 23; కమిన్స్‌ (బి)రబాడ 1; స్టార్క్‌ (బి) రబాడ 1; లైయన్‌ (బి) యాన్సెన్‌ 0; హేజిల్‌వుడ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (56.4ఓవర్లు) 212; వికెట్ల పతనం: 1-12, 2-16, 3-46, 4-67, 5-146, 6-192, 7-199, 8-210, 9-211; బౌలింగ్‌: రబాడ 15.4-0-51-5; యాన్సెన్‌ 14-5-49-3; ఎంగిడి 8-0-45-0; ముల్డర్‌ 11-3-36-0; కేశవ్‌ మహరాజ్‌ 6-0-19-1; మార్‌క్రమ్‌ 2-0-5-1

వివరాలు 

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:

మార్‌క్రమ్‌ (బి) స్టార్క్‌ 0; రికిల్టన్‌ (సి) ఖవాజా (బి) స్టార్క్‌ 16; ముల్డర్‌ (బి) కమిన్స్‌ 6; బవుమా బ్యాటింగ్‌ 3; స్టబ్స్‌ (బి) హేజిల్‌వుడ్‌ 2; బెడింగ్‌హామ్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (22 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 43; వికెట్ల పతనం: 1-0, 2-19, 3-25, 4-30; బౌలింగ్‌: స్టార్క్‌ 7-3-10-2; హేజిల్‌వుడ్‌ 7-3-10-1; కమిన్స్‌ 7-3-14-1; లైయన్‌ 1-0-1-0